- జీనోమ్ వ్యాలీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి
- ఏడాది కాలంలో ఐటీ, పరిశ్రమల ప్రగతిని వెల్లడించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు : రాబోయే పదేండ్లలో ఓఆర్ఆర్ చుట్టూ 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐ ఇన్ స్టిట్యూట్‌ను వచ్చే మొదటి త్రైమాసికంలో ప్రారంభిస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక యాప్ ను వెయ్యి బడుల్లో ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఏడాదిలో ఐటీ, ఇండస్ర్టీస్ సాధించిన ప్రగతిని గురువారం సెక్రటేరియెట్ లో మీడియాకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేస్తామని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
‘‘పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయి. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పాలసీని మరింత పటిష్టం చేశాం. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్నొవేట్ తెలంగాణ పేరుతో స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నాం. మీ సేవ ద్వారా రోజూ 80 వేల మందికి సేవలు అందుతున్నాయి. ఇక ఫెడెక్స్ సంస్థ గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో తమ అడ్వాన్స్‌డ్ కెపాసిటీ కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొదటి సంవత్సరంలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది” అని మంత్రి వివరించారు.
ఆటోమోటివ్ సేఫ్టీ ఇన్నొవేషన్‌లో జర్మన్ లీడర్ జడ్ఎప్ లైఫ్‌టెక్ మొదటి సంవత్సరంలో 450 ఇంజినీర్లను ఆన్‌బోర్డ్ చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో మూడు గ్లోబల్ ఆర్అండ్ డీ కేంద్రాలలో ఒక బ్రాంచ్ ను స్థాపించిందని వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ చైన్‌లలో ఒకటైన మారియట్ 300 మంది ఉద్యోగులతో ప్రారంభించిన మొట్టమొదటి జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని వెల్లడించారు. టెక్నాలజీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ అదనంగా 15,000 మంది ఉద్యోగులను నియమించుకుని, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారీ పెట్టుబడులు పెడుతోందని శ్రీధర్ బాబు తెలిపారు.