
- స్కిల్ వర్సిటీలో 4 నెలల కోర్సు అందిస్తాం
హైదరాబాద్, వెలుగు: బీటెక్ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ రంగంలో నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరిట యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ కోర్సును అందిస్తామని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం, ఎక్విప్ సహకారంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. బ్యాంకింగ్, ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా సహకరిస్తామని చెప్పారు. ఈ కోర్సు కోసం ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని, కేవలం సర్టిఫికెట్, ఇతర అడ్మినిస్ట్రేషన్ అవసరాలకు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఈ దఫా కోర్సుకు 1320 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరందరికి ఆదివారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ) ప్రాంగణంలో టెస్టు పెడతామన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలలో (జీసీసీ) యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 355 జీసీసీలు ఉండగా.. 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.