- సింగరేణి స్థలంలో 7 వేల కుటుంబాలకు పట్టాలు
- నిస్వార్థ సేవా నాయకుడు వంశీకృష్ణ
- ఎంత మెజార్టీతో గెలిపిప్తే అంత అభివృద్ధి
- పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతాం
- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
గోదావరిఖని: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే రామగుండంను పారిశ్రామిక కారిడారుగా ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ గోదావరిఖనిలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదారు అరకాల వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐ ఎన్ టి యు సి నాయకులు బాబర్ సలీం పాషా, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాకా వెంకటస్వామి మనవడు , కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆశీర్వదించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించి అభ్యర్థిగా వంశీకృష్ణ ను నియమించారన్నారు. రాబోయే తరానికి నిస్వార్థపు సేవ చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడు వంశీ అని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే వంశీ ముందుకు వచ్చాడన్నారు. ఎంత పెద్ద మెజార్టీతో వంశీని గెలిపిస్తే అంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పుతాన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తాన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న 7 వేల కుటుంబాలకు పట్టాలు ఇచ్చేందుకు ఎన్నికల తరువాత కృషి చేస్తామని ఆయన ప్రకటించారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తాన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకులను ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే కేసీఆర్, బీజేపీ లీడర్లు ఓర్వలేక పోతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తరుగు పేరు మీద రైతులకు నష్టం జరుగుతుంటే మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాలకుర్తి కి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసిన తరువాతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతామని ప్రకటించారు. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి వంశీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరు
బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తప్ప ఎవరూ ఉండే పరిస్థితి లేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గడ్డం వంశీ గెలువబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉనికిని కోల్పోతున్న బబీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీటిని సముద్రం పాలు చేసి కాంగ్రెస్ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.