
- ఢిల్లీ పటౌడీ హౌస్‌లో పీపీపీ పద్ధతిలో తెలంగాణ భవన్ నిర్మాణం
- గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయపెట్టేవాళ్లు.. అందుకే కేసులు తక్కువ
- మేం స్వేచ్ఛగా కేసులు తీసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చినం.. అందుకే ఎక్కువ నమోదు
- అసెంబ్లీలో జీఏడీ, పోలీసింగ్, జస్టిస్ శాఖల పద్దులపై చర్చ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్‌ను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ ప్రధాన ప్రాంగణంలోనే కౌన్సిల్ భవనాన్ని నిర్మిస్తున్నామని, 3 నెలల్లో అది పూర్తవుతుందని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో జీఏడీ, జస్టిస్, ఎలక్షన్ పద్దులపై మంత్రి శ్రీధర్‌బాబు రిప్లై ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణకు కేటాయించిన పటౌడీ హౌస్‌లో పీపీపీ పద్ధతిలో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ చెడ్డవాళ్లు ఉంటారని, అలాగని వ్యవస్థను మొత్తం తప్పుపట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ‘‘హైదరాబాద్‌లో 2021లో 89 హత్యలు , 2023లో 86, 2024లో 81 హత్య కేసులు నమోదయ్యాయి.
అయితే, ఏటేటా సిటీకి వచ్చే వారి సంఖ్య నిష్పత్తి ప్రకారం ఇది తక్కువ. కేసులు పెట్టేవారు స్టేషన్లకు వస్తే భయపెట్టి వెనక్కు పంపకుండా కేసులు తీసుకోవాలని చెప్పాం. అందుకే కేసుల సంఖ్య పెరిగింది. కానీ, బీఆర్ఎస్ హయాంలో పోలీసులు ప్రజలను భయపెట్టేవారు. అందుకే కేసులు తక్కువగా నమోదయ్యేవి. పోలీసుల పిల్లలకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు మంచిరేవులలో సీఎం శంకుస్థాపన చేశారు. షీటీమ్స్, భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేస్తాం. డ్రగ్స్ నిరోధానికి ఆలౌట్ వార్‌కు సీఎం పిలుపునిచ్చారు. 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు, 26 నార్కోటిక్ వింగ్ లను ఏర్పాటు చేశాం. టీజీన్యాబ్లో 429 పోస్టులను భర్తీ చేశాం. 4,191 కేసులు పెట్టి.. 9,426 మందిని అరెస్ట్ చేసి.. 261 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశాం. పిల్లలకు డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో 600 కార్యక్రమాలను నిర్వహించాం. డ్రగ్స్‌ను తీసుకొస్తున్న విదేశీయులను అరెస్ట్ చేస్తున్నాం. నషా ముక్త్ అభియాన్‌లో భాగంగా 26 డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వం కింద మరో 12 సెంటర్లను నెలకొల్పాం’’ అని శ్రీధర్ బాబు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరోను పటిష్టం చేస్తున్నాం
సైబర్ సెక్యూరిటీ బ్యూరోను పటిష్టం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో టెక్నాలజీ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 25 వేల మంది బాధితులకు రూ.163 కోట్లు చెల్లించామని తెలిపారు. 223 కేసుల్లో 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని వివరించారు. ‘‘సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సాయం తీసుకుంటున్నాం. సిగ్నల్ ఆటోమేషన్ చేస్తున్నాం. రద్దీకి తగ్గట్టుగా సిగ్నలింగ్‌ను నిర్వహిస్తాం. ఏఐని కూడా వాడుకొని సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహిస్తాం. ట్రాఫిక్‌ను నియంత్రిస్తం. ఫ్రీ లెఫ్ట్ మలుపులను సమర్థవంతంగా అమలు చేస్తం. ట్రాఫిక్ రీరూట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. మిగతా సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాహనాల సగటు వేగం ఎక్కువగా ఉంది. గంటకు 23.40 కిలోమీటర్ల వేగంతో మన దగ్గర వాహనాలు కదులుతున్నాయి. కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి సిటీల్లో ఆ స్పీడ్ 20 కన్నా తక్కువగానే ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా, ఆర్థిక నేరాల విచారణకు సైబరాబాద్‌లో అదనంగా ఆర్థిక నేరాల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామన్నారు. అయితే, ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడంతో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. వ్యంగ్యంగా ఎందుకు నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని హేళన చేయడం తగదని హితవు పలికారు. ఇటీవల రాంచీలో నిర్వహించిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో మన పోలీసులకు 18 పతకాలు వచ్చాయని చెప్పారు. బెస్ట్ పోలీసింగ్‌లో తెలంగాణకు నెంబర్ వన్ స్థానం లభించిందని, ఇది బీఆర్ఎస్ హయాంలోనూ రాలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సీసీ కెమెరాలకు ఐదేండ్లే గ్యారంటీ..
భద్రత పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బీఆర్ఎస్ సభ్యులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వారి హయాంలో ఏర్పాటు చేసినవే పనిచేయడం లేదని విమర్శించారు. ఓ మెకానికల్ డివైజ్‌కు ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాటికి ఆ పార్టీ నేతలు గ్యారంటీ ఇచ్చారా? అని నిలదీశారు. సీసీ కెమెరాలకు ఐదేండ్లే గ్యారంటీ ఉంటుందని చెప్పారు. మెకానికల్ డివైజ్‌లు మానవ ప్రమేయం లేకుండా ఒక్కోసారి పాడవుతాయని అన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, స్వేచ్ఛగా ఎఫ్ఐఆర్ల నమోదు వంటి వాటిని చేపడుతున్నామని చెప్పారు. సిటీలో అదనంగా అవసరాలకు తగ్గట్టుగా ఫైర్ సేఫ్టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.