పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాలికి కూలిపోయే బ్రిడ్జిలు కట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదని, కూలిన నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట, మైదంబండ, పోతారం, హరిపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇటీవల కూలిపోయిన ఓడెడ్ బ్రిడ్జిని శ్రీధర్ బాబు, వంశీకృష్ణ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే.. అక్కడ సిమెంట్ వేస్తే సరిపోతుందని కేసీఆర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి 4 నెలలే అవుతుందని,అయినా తాము ఏమేం చేశామో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
మంథనికి పరిశ్రమలు తీసుకొస్తా: వంశీకృష్ణ
దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం తనకు స్ఫూర్తిదాయకమని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాకా వెంకటస్వామి, శ్రీపాదరావు మంచి స్నేహితులన్నారు. అందరి ఆశీర్వాదంతో తనను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశమిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతోనే తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని, తాను గెలిచాక మంథని నియోజకవర్గంలో మంత్రి సహకారంతో పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, జగన్ మోహన్ రావు, శివ, యాదగిరి రావు, సంపత్ రావు, శివ, బక్కారావు తదితరులు పాల్గొన్నారు.