పెద్దపల్లి, సుల్తానాబాద్, వెలుగు: ఎన్నికల్లో హామీ మేరకు ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలుచేశామని, మరో 10, 15 రోజుల్లో మరో రెండు గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
శాస్త్రినగర్ లోని ఆంజనేయస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు హామీ మేరకు 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో బైపాస్ రోడ్లు, బస్ డిపో ఏర్పాటు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఉన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
తిమ్మాపూర్,వెలుగు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఉమ్మడి జిల్లాకు రావడంతో తిమ్మాపూర్మండలం రేణిగుంట టోల్‌ప్లాజా వద్ద కాంగ్రెస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. అలుగునూరులో చౌరస్తా వద్ద రోల్ బాల్ క్రీడాకారుడు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. మాజీ సర్పంచ్ శ్రీ గిరి రంగరావు
పాల్గొన్నారు.