ఎంఎస్ఎంఈ కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యం

ఎంఎస్ఎంఈ  కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యం
  • మహిళలు, దళితులకు ప్రాధాన్యం
  • పీఎం విశ్వకర్మ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు: మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ)కు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నూతన విధానంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్​ మేనేజర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన ఎంఎస్​ఎంఈ పాలసీ హ్యాండ్​బుక్​ను ఆవిష్కరించారు.

 ఎంఎస్​ఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు అర్హతలు, దరఖాస్తు విధానం సహా అన్ని వివరాలు హ్యాండ్​బుక్​లో ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ఎంఎస్ ఎంఈల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బీసీలు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్న పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. మరో పదేండ్లలో రాష్ట్ర బడ్జెట్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖదే కీలక బాధ్యత అన్నారు.

రాష్ట్రంలో క్లస్టర్ల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిధుల సద్వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. జైకా మద్దతుతో చేపడుతున్న ఎంఎస్ ఎంఈ పథకాలు కార్యరూపందాల్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పరిశ్రమల శాఖ కమిషనర్​ మల్సూర్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన, సమీక్ష సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్. స్వామినాథన్, రామానంద శుక్లా, గౌరి మోన్వాని, ఆర్. శ్రీనివాస్, రవివర్మ, 
బావయ్య తదితరులు పాల్గొన్నారు.