
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో హత్యా రాజకీయాలను సహించేది లేదని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి మర్డర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ డీసీసీ ఆఫీసులో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో పదేండ్లలో జరిగిన అవినీతిని తాము బయటికి తీస్తున్నామని చెప్పారు. వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని తెలిపారు.
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నదని ఆరోపించారు. గ్రాడ్యుయేట్స్ సమస్యలపై అవగాహన ఉన్న నరేందర్ రెడ్డినే ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. 317 జీవో వచ్చినప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, ఆయనకు దానిపై మాట్లాడే అర్హత లేదని శ్రీధర్ బాబు అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారానిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయబోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్స్ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.