బురద చల్లడం ఆపండి:మంత్రి శ్రీధర్ బాబు

బురద చల్లడం ఆపండి:మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని సూచించారు. 

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తామని, నిస్సృహతో కూడిన ప్రకటనలతో తమలో ఉన్న గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల ప్రజాప్రయోజనం ఉండదన్నారు. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజాభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగు తుందని చెప్పారు. ఇంత జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు.  

నేలమట్టమైన పార్టీని నాలుగున్నరేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏళ్లు నిరాటంకంగా పరిపాలిస్తామని చెబుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అనుకోవాలన్నారు.