నిజామాబాద్ లోని షూగర్ ఫ్యాక్టరీ పున :ప్రారంభానికి కసరత్తు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పరిశ్రమ ప్రారంభం, చెరకు సాగు ఒకేసారి జరగాలి. కొత్త వంగడాలకై వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. బీఆర్ఎస్ నిర్ణయాలతో చెరకు రైతులు ఎంతో నష్టపోయారన్న మంత్రి.. రైతులకు పర్చేస్ టాక్స్, సబ్సిడీని పరిశీలిస్తున్నామని తెలిపారు. మంత్రి వెంట పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారన్న మంత్రి.. పాలనలో మార్పు చూపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారంటీ లను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27 న మరో రెండు గ్యారంటీ లు అమల్లోకి వస్తాయని తెలిపారు. రైతు బంధును గత సర్కార్ అనర్హులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెరుకు ధర పెంచిందన్నారు. యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.