జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగా రెడ్డి హత్యను ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని సోమవారం (అక్టోబర్ 28) మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గంగారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు.. పార్టీ, ప్రభుత్వం జీవన్ రెడ్డి విషయంలో ఆలోచించి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గంగారెడ్డి హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. సంఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అనేక సందేహాలు ఉన్నాయని చెప్పిన వెంటనే డీజీపీ, సీఎం, పీసీసీ చీఫ్‌తో మాట్లాడానని చెప్పారు.
గంగారెడ్డి హత్యపై ఆయన కుటుంబ సభ్యులకు అనేక సందేహాలు ఉన్నాయని.. వాటిని పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. పోలీసులు ఎక్కడ పొరపాటు జరగకుండా విచారణ చేపట్టాలని సూచించారు. జీవన్ రెడ్డి ఈ సంఘటనతో నిరుత్సాహం చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే నాయకుడు జీవన్ రెడ్డి. మా పార్టీకి ధైర్యం చెప్పే నాయకుడు జీవన్ రెడ్డి మనస్తాపం చెందటం చాలా బాధగా ఉందన్నారు.