కంచ గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలే.. బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు: మంత్రి శ్రీధర్ బాబు

కంచ గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలే.. బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు: మంత్రి శ్రీధర్ బాబు
  • కంచ గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలేదు
  • అలాంటప్పుడు బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు 
  • కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
  • సెబీ, ఆర్బీఐ రూల్స్​కు లోబడే టీజీఐఐసీ ద్వారా బాండ్ల రూపంలో నిధుల సేకరణ
  • అవి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యానికి ఖర్చు 
  • ఫేక్​ ఏఐ వీడియోలతో బీఆర్ఎస్ విష ప్రచారాలు.. కుట్రలు
  • ఆ భూముల్లో ఏనుగులు పారిపోతున్నట్లు ఫొటోలేంది?
  • 9 ఏండ్ల కింద రాజస్థాన్​లో చనిపోయిన జింక పిల్లను హెచ్​సీయూలో చనిపోయినట్టు వైరల్​ చేశారని ఫైర్​

 హైదరాబాద్, వెలుగు:  కంచ గచ్చిబౌలి భూములపై రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇంతవరకూ తాము ఆ భూమిపై ఎలాంటి అప్పు తీసుకోలేదని.. అలాంటిది కేటీఆర్​ చెప్తున్న బ్రోకర్​ ఎక్కడ ఉంటాడని ఆయన ప్రశ్నించారు. ‘‘లిటిగేషన్​ భూమిపై అప్పు ఎట్ల తీసుకుంటరని కేటీఆర్​ ప్రశ్నిస్తున్నడు. ఆ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు చెప్పాక.. పైగా ఆ భూమిపై ఎలాంటి వ్యాజ్యాలు లేనప్పుడు ఎట్ల లిటిగేషన్​ భూములవుతాయి? అసలు ఆ ల్యాండ్​ఫై మేం అప్పే తీసుకోలేదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, ప్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా కుట్రలు చేస్తున్నరు” అని మండిపడ్డారు. 

ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకులుగా బీఆర్​ఎస్​ నేతలు మారారని అన్నారు. సెబీ, ఆర్బీఐ రూల్స్ ప్రకారమే టీజీఐఐసీ ద్వారా బాండ్ల రూపంలో నిధుల సేకరణ చేపట్టామని, ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. బాండ్ అనేది పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్ అని, టీజీఐఐసీ అన్ని నిబంధనలు పాటిస్తూ లావాదేవీలు జరిపిందని  తెలిపారు. ‘‘రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దని, పరిశ్రమలను ఇక్కడ ఎవరూ నెలకొల్పొద్దని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దన్న దురుద్దేశంతోనే బీఆర్​ఎస్​ నేతలు  విష ప్రచారానికి తెగించారు. 

వారి ఆలోచనలోనే ఆ విషం కనిపిస్తున్నది. మేం మాత్రం విదేశాలకు వెళ్లినప్పుడు కూడా గత పదేండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందనే చెప్తం. బీఆర్​ఎస్​ నేతలు  అందుకు భిన్నమైన మనస్తత్వంతో ఉన్నరు” అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడారు. హెచ్‌‌‌‌సీయూ భూమిలో ఏనుగులు ఉన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ సాయంతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఉన్న ఏనుగుల శాతం ఎంత? అసలు అవి ఏ అడవిలో ఉన్నాయి?” అని ప్రశ్నించారు. 9 ఏండ్ల కింద రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లను హెచ్ సీయూలో చనిపోయినట్టు ఏఐ సాయంతో తప్పుడు ఫొటోలు వైరల్ చేశారని ఆయన అన్నారు. 

బాండ్ల రూపంలో తీసుకొని స్కీమ్​లకు.. 

రూ. 5 వేల 200 కోట్ల భూమిని రూ. 30 వేల కోట్ల విలువచేసే భూమిగా చూపించారని కేటీఆర్ అనడాన్ని శ్రీధర్ బాబు  తప్పుపట్టారు. సెక్యూరిటీ బ్యూరో ఆఫ్​ ఇండియా అనే రియల్ ఎస్టేట్ లకు సంబంధించిన సర్వే సంస్థ ద్వారా ఈ భూమిపై చేసిన సర్వే ప్రకారం దీనికి రూ. 23 వేల కోట్ల విలువను కట్టారని తెలిపారు. దీన్ని సెబీ, ఆర్బీఐ కూడా నిర్ధారించిందని స్పష్టం చేశారు.

 టీజీఐఐసీ మార్కెట్ ఫోర్సెస్ పద్ధతిలో  37 అంతర్జాతీయ సంస్థల నుంచి మ్యూచువల్ పెట్టుబడులను బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించిందని, తక్కువ వడ్డీతో వీటిని సేకరించిందని.. ఈ డబ్బులను రైతు భరోసా, రుణమాఫీ, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టామని వివరించారు. సెబీలో రిజిస్టర్​ అయిన మర్చంట్ బ్యాంకర్ ను టీజీఐఐసీ నియమించుకొని 2024 డిసెంబర్ 5న రూ. 9 వేల 995 కోట్లను 9.35 శాతం వడ్డీకి బాండ్ల రూపంలో  నిధులను సేకరించిందని ఆయన తెలిపారు. 

అదే బీఆర్ఎస్  ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆర్‌‌‌‌‌‌‌‌ఈసీ, పీఎఫ్‌‌‌‌సీ, బీఓబీ సంస్థల నుంచి 10.09 శాతం వడ్డీకి తీసుకుందని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఏమైందో కూడా అందరికీ తెలుసని అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం,  మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రుణం తీసుకున్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రుణాలు పొందిన సంస్థలకు తిరిగి రుణాలు ఎలా చెల్లించగలమనే దానిపై చెప్పిన కారణాలు చూస్తే.. వారు ఎన్ని అబద్ధాలు ఆడారో తెలిసిపోతుంది.

 బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా  కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణం తీసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తీసుకున్న బాండ్ల రూపంలో సేకరించిన రూ. 9 వేల 995 కోట్ల నుంచి రుణమాఫీకి 2 వేల146 కోట్లు,  రైతు భరోసాకు 5 వేల 463 కోట్లు, సన్న బియ్యం కోసం  947 కోట్లు వాడాం” అని ఆయన వివరించారు.

అర్వింద్​ నా పేరెందుకు ఎత్తారో నాకు తెలియదు

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​రెండు రోజుల కింద తనపై చేసిన కామెంట్లకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరు సమర్థులనేది గుర్తించే రేవంత్ రెడ్డిని సీఎంగా చేసిందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఆయన(అర్వింద్​) ఏ ఉద్దేశంతో నా పేరును ప్రస్తావించారో నాకు తెలియదు. అయితే మా పార్టీలో సీఎం అభ్యర్థులుగా అందరూ సమర్థులే. ఇప్పుడు మాత్రం రేవంత్​ రెడ్డికి ఆ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. అధిష్టానం అనుకున్న రీతిలో ఆయన పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో సీఎం పదవిపై చర్చ అనవసరం” అని శ్రీధర్​బాబు అన్నారు. సెక్రటేరియెట్​లో కాంగ్రెస్ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులతో ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదని మంత్రి తెలిపారు. సెక్రటేరియెట్‎కు ఏ పార్టీ నేతలైనా రావొచ్చని, అది అందరిదీ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

సబర్మతిపై ఓ తీరు.. మూసీపై మరో తీరా?

తాము బాధ్యతా యుతంగా మూసీ పునరుజ్జీవం చేపడ్తున్నామని.. ప్రజలకు మంచి గాలి, నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. కానీ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్​ఎస్​ నేతలు రకరకాల వివాదాలు సృష్టిస్తూ.. సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘సబర్మతి పరీవాహక ప్రాంతవాసులకు మేలు జరగాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అదే అభివృద్ధి హైదరాబాద్​లోని మూసీ ప్రాంతంలో చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ మాత్రం వద్దంటున్నది. 

సబర్మతిలో అన్నివర్గాల ప్రజలు ఉన్నారు.. ఇటీవల మేం సబర్మతికి వెళ్లిన సందర్భంలో అక్కడి అభివృద్ధిని చూశాం. మూసీ అభివృద్ధిలో సైతం అన్నివర్గాల వారు ఉన్నారు. దురుద్ధేశాలతో అభివృద్ధికి కులాన్ని ఆపాదించొద్దు” అని అన్నారు. మీడియా ప్రతినిధులను సబర్మతికి తీసుకుని వెళ్లాలని.. సబర్మతి నది అభివృద్ధికి ముందు, అభివృద్ధికి తర్వాత పరిస్థితులను సేకరించి, ఇక్కడి మూసీ అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ఆయన కోరారు. 

‘‘పర్యావరణం గురించి మాట్లడే బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియెట్ నిర్మిస్తున్న సమయంలో 207 పెద్ద, పెద్ద చెట్లను కూల్చారు. వాటి స్థానంలో ఒక్క చెట్టు కూడా పెట్టలేదు. అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా?” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ను, నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు అక్కడ వందల కంపెనీలు ఏర్పాటై, లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు సాగుతున్నాయని,  ఉపాధి అవకాశాలు మెరుగపడ్డాయని శ్రీధర్​బాబు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారి హయాంలో ఎన్ని చెట్లు నరికేశారో, ఎంత అడవి విస్తీర్ణం తగ్గిందో తమ దగ్గర పూర్తి అధారాలు ఉన్నాయని అన్నారు.