
హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మతపరమైన ఉద్రిక్త పరిస్థితులకు తెలంగాణలో అవకాశం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం (మార్చి 26) శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పోలీసులు రూ.185 కోట్లు బాధితులకు వాపస్ ఇచ్చారు.. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ రికవరీ చేయలేదని తెలిపారు.
ఆనాడు కేసులను నమోదు చేయకుండా బాధితులను భయపెట్టించారు.. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో మేం చేతల్లో చూపించామని అన్నారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మిస్తున్నామని.. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ఈ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందిస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు స్వేచ్ఛగా కేసులు నమోదు చేస్తున్నారని.. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతల చెప్తేనే కేసులు నమోదయ్యాయని ఆరోపించారు.
ALSO READ | సీఎం అలా ఎలా మాట్లాడుతారు..? స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్, ఎంఐఎం నిరసన
మంథనిలో అడ్వకేట్ల మర్డర్ జరిగితే.. ఈ ఘటనలో పోలీసులు ఎలా వ్యవహరించిన తీరు అందరి చూశారని విమర్శించారు.ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన టీజీ న్యాబ్ ను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పోస్టులు మంజూరు చేశామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీసులు కేసులు వేగంగా పరిష్కరిస్తున్నారని కొనియాడారు. సైబర్ నేరాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నామని.. సైబర్ సెక్యూరిటీ యావత్ దేశం సమస్య అని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ట్రాఫిక్కు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించామని గూగుల్ మ్యాప్ ఉపయోగించుకుని ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర మెట్రో సిటీలతో పోల్చితే.. మన ట్రాఫిక్ నియంత్రణ బాగుందని అన్నారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నామని అన్నారు.