
హన్మకొండ: రాష్ట్ర ప్రగతికి, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్ర ప్రగతిలో యువతి యువకులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా యువత కు ఒక మంచి వేదిక లాంటిందని.. నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా యువత ప్రయత్నించాలని.. పరిశ్రమలకు కావాల్సిన చదువుతో ఉద్యోగం లభిస్తుందన్నారు. రానున్నది డిజిటల్ యుగమని.. సాంకేతిక పరిజ్ణానాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
స్కిల్ సెంటర్‌గా హైదరాబాద్‌ను ప్రధాన కారిడార్‌గా మార్చుదామనుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని.. మేం అధికారంలోకి వచ్చాక వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు.