- రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉన్నది: శ్రీధర్‌బాబు
- అనువైన పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నం
- ఎన్నో కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచింది
- ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని మంత్రి వ్యాఖ్య
- గిఫాస్లోని కంపెనీల ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఎంతో అనుకూలమైందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, రేథియన్ వంటి సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతున్నదని చెప్పారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఏడీపీకి పెద్ద మొత్తంలో భాగస్వామ్యం ఉన్నదని గుర్తు చేశారు.
హోటల్ తాజ్ కృష్ణలో ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (జీఐఎఫ్ఏఎస్) (గిఫాస్)లో భాగమైన 60 ప్రముఖ కంపెనీలకు చెందిన 90 మంది ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అయ్యారు. ఇప్పటి దాకా ఇంత పెద్ద సంఖ్యలో ఏరోస్పేస్ సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ‘‘సాఫ్రాన్ కంపెనీ 2018లో మూడు మెగా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అందులో అత్యంత ముఖ్యమైన ఏరో ఇంజిన్ ప్లాంట్ ఒకటి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఫెసిలిటీ. టాటాతో కలిసి ఎయిర్‌బస్ కూడా హైదరాబాద్ యూనిట్లో క్రిటికల్ కాంపోనెంట్స్, సబ్ సిస్టమ్స్ ను తయారు చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన న్యూకాన్ ఏరోస్పేస్తో కలిసి ఫ్రాన్స్‌కు చెందిన అమెత్రా, ఏరేసియా సంస్థలు జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేశాయి’’అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
నిపుణుల అవసరం ఉంటది
హైదరాబాద్ స్టార్టప్ ధ్రువ స్పేస్.. ఫ్రాన్స్‌కు చెందిన స్కై రూట్ తో కలిసి పని చేస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘‘ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు అనువైన పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నాం. మెగా ప్రాజెక్ట్స్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీలతో పాటు పలు చర్యలను తీసుకుంటున్నం. అందుకే ఏరోస్పేస్ పెట్టుబడులకు తెలంగాణ మైల్‌స్టోన్‌గా మారుతున్నది. ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో పనిచేసేందుకు నిపుణుల అవసరం ఉంటది. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో యువతకు శిక్షణ ఇస్తాం. వరుసగా నాలుగేండ్లు సివిల్ ఏవియేషన్, రెండేండ్లకోసారి ఇచ్చే ప్రతిష్టాత్మక బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఏరోస్పేస్ అవార్డు తెలంగాణకు దక్కింది’’అని శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్‌లోనే తక్కువ ఖర్చు..
ఎఫ్‌డీఐ గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం.. హైదరాబాద్ అత్యంత తక్కువ ఖర్చు అయ్యే ఏరోస్పేస్ సిటీగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని గిఫాస్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ కమిటీ చైర్మన్ డైడియర్ కాయత్ అన్నారు. రాష్ట్రంలో తమ ఏరోస్పేస్ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ, ఫ్రాన్స్ మధ్య బంధం మరింత బలమైందని డ్యూరో డి ఫ్రాన్స్ డైరెక్టర్ మాస్కల్ లోర్యూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సాఫ్రాన్, దసో, ఎంబీడీఏ, థేల్స్, ఏరియేన్ గ్రూప్, సీఎన్ఈఎస్, దాహర్, హెక్సెల్, లైబర్, రోక్సెల్, సోర్పా స్టీరియా అరీషియా వంటి సంస్థలకు చెందిన సీఈవోలు, ఉన్నతాధికారులు, రాష్ట్రానికి చెందిన ఏవియేషన్, ఏరోస్పేస్ ఇండస్ట్రీల ప్రముఖులు పాల్గొన్నారు.