- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలో ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్, సెర్చ్ సెంటర్‌ను మరోచోటికి తరలిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎక్కడికీ తరలించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా వెటర్నరీ సెర్చ్ సెంటర్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. వెటర్నరీ పాలిటెక్నిక్ సమీపంలోని 10 ఎకరాల స్థలాన్ని కోర్టుకు కేటాయించామని, అందుకు బదులుగా 20 ఎకరాల భూమిని ఇస్తున్నామని చెప్పారు. బండమీదిపల్లి, వీరన్నపేట, పాతపాలమూరు, ఏనుగొండ లాంటి కాలనీలను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, వెటర్నరీ జేడి మధుసూదన్ గౌడ్, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోన్లను పక్కన పెట్టాలి
స్టూడెంట్లు ఫోన్లతో కాలక్షేపం చేయకుండా స్టడీపై దృష్టి సారించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన హాస్టల్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మాయిలకు సరైన విద్య అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హాస్టల్ లో ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. హాస్టల్ నిర్వహణను తెలుసుకునేందుకు అకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించారు. మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గిరిజన సంక్షేమ ఆఫీసర్ చత్రూనాయక్ పాల్గొన్నారు.
శభాష్.. గౌతమ్ యాదవ్
- స్టూడెంట్‌ను అభినందించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: రామానుజమ్ జయంతి పురస్కరించుకొని ఈనెల 27న గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్టులో ఫస్ట్ ప్రైజ్ సాధించిన గౌతమ్ యాదవ్‌ను కలెక్టర్ వల్లూరి క్రాంతి అభినందించారు. బీచుపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇతనితో పాటు సహకరించిన టీచర్ రమేశ్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. అలాగే స్వచ్ఛ గురుకుల వారోత్సవాల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన గట్టు, అలంపూర్, మానవపాడు స్కూళ్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, రాష్ట్ర గణిత ఫోరం అధ్యక్షుడు జహీరుద్దీన్, కృష్ణ, విజయ్ ఉన్నారు.
6 గంటల పాటు డ్రంకెన్ డ్రైవ్
- ఎస్పీ అపూర్వరావు
వనపర్తి టౌన్ , వెలుగు: న్యూ ఇయర్ వేడుకలను రూల్స్ మేరకు నిర్వహించుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు.శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. 30కి పైగా వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించామని చెప్పారు. మద్యం సేవించినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సైలెన్సర్ తొలగించినా..చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో పబ్లిక్ ప్లేసెస్, ప్రధాన రోడ్డు మార్గాల్లో న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోరాదని సూచించారు.
మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసు నమోదు చేయండి
- వనపర్తి టౌన్ పీఎస్ లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
వనపర్తి, వెలుగు: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగష్టు30 న వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన కొత్త పెన్షన్ల పంపిణీ సందర్భంగా పీఎం నరేంద్రమోడీని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించారన్నారు. అలాగే ప్రజాపతినిధులను బండ బూతులు తిట్టడం దారుణమన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నారాయణ, కార్యదర్శి పరశురాం , పట్టణ అధ్యక్షులు రామ్మోహన్ , అధికార ప్రతినిధి బచ్చు రాము , సూగూరు రాము ఉన్నారు.
బైరి నరేశ్‌ను అరెస్ట్ చేయాలి
నెట్‌వర్క్, వెలుగు: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం నేత బైరి నరేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని అయ్యప్ప దీక్షాపరులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో బైరి నరేశ్ అయ్యప్పస్వామిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. స్వామి చరిత్రను తెలుసుకోకుండా.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే హిందూ సమాజం ఊరుకోబోదని హెచ్చరించారు. అయ్యప్ప స్వాములకు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు మద్దతిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
బీజేపీలో చేరిన మాజీ జడ్పీటీసీ
అడ్డాకుల, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ బాల్‌నర్సింహులు బీజేపీలో చేరారు.శుక్రవారం బీజేపీ మూసాపేట మండల ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ అధ్వర్యంలో పార్టీలో చేరగా.. పాలమూరు పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు సంకలమద్ధి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ కె జలందర్, నేతలు ఈశ్వర్, పరిపూర్ణా చారి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, రాజేశ్ గౌడ్ పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సింగాయిపల్లిలోని కాలేజీ ఎదుట స్టూడెంట్లతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్, కోఆర్డీనేటర్‌గా రెండు వేతనాలు తీసుకోవడం రూల్స్‌కు విరుద్ధమన్నారు. కాలేజీలో పాత పేపర్లు అమ్మి, డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీలోనూ అత్యధిక విద్యార్హతలు ఉన్నావారిని పక్కకు పెట్టి తన బంధువులు, కుటుంభ సభ్యులను నియమించారని విమర్శించారు. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జోనల్ ఇన్‌చార్జి వంశీ, తేజ, పవన్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
సివిల్ రైట్స్ డే నిర్వహించాలి
- కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామాల్లో జరిగే మతపరమైన వేడుకల నిర్వహణకు ముందు సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మనోహర్‌తో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మతపరమైన వేడుకల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని దళిత నేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ వేడుకల్లో తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీవోలకు సూచించారు. జిల్లాలో 319 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. ఎఫ్‌ఐఆర్ స్థాయిలో 296 కేసులకు రూ. 1,74,35000 బాధితులకు పరిహారంగా ఇచ్చామని చెప్పారు. రెండో స్టేజీలో 233 కేసుల్లో 207 మంది బాధితులకు రూ. 1,94,01250 పరిహారంగా అందించామన్నారు.19 కేసులకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉందని, వెంటనే పూర్తిచేయాలని పోలీసులను ఆదేశించారు. 26 మర్డర్, రేప్ కేసులు కేసులు నమోదు కాగా.. 3 కేసులకు చార్జిషీట్ పెండింగ్ ఉందన్నారు. శాశ్వత పరిహారం కింద డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడెకరాల భూమి, ఉద్యోగ కల్పన లాంటి అంశాలు ఆయా శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై దృష్టి పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారిని ఆదేశించారు. ప్రధాన రోడ్ల పక్కన గిరిజన, దళితుల భూముల పట్టాలు తారుమారు చేస్తున్నారని, ధరణిలో మ్యుటేషన్లు చేయడం లేదని సంఘం నాయకుడు శంకర్ నాయక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ ధరణిలో 25 వేల కేసులు డిస్పోజ్ చేశామని, ఎక్కడైనా సమస్యలు ఉంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కోర్ ఏరియాలో నివసించే చెంచులకు మాత్రమే శాశ్వత ఇళ్లు కట్టుకోడానికి ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని, తాత్కాలిక పద్ధతిలో ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. చెంచులు ఆర్వోఎఫ్ఆర్ కింద హక్కులకు దరఖాస్తు చేసుకోవాలని, అటవీ నుంచ వచ్చే తేనె, గడ్డలు ఇరరాత్రా వాటిని సేకరించి అమ్ముకోడానికి ఫారెస్ట్ రైట్స్ కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ రావు, డీఎఫ్‌వో రోహిత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాంలాల్, ఆర్డీవోలు, డీఎస్పీలు, నాయకులు శంకర్ నాయక్, యు. బాలరాజు, డి. ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోడు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు జాన్ వెస్లీ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12,500 మంది దరఖాస్తులు చేసుకుంటే 300 మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలోని తరతరాలుగా పోడు భూములను సేద్యం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వర్గం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసులు, గీత, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేశ్య నాయక్, శంకర్ నాయక్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనాథ పిల్లలను ఆదుకోరా..?
- బాధిత పిల్లలను పరామర్శించిన మందకృష్ణ మాదిగ
నాగర్ కర్నూల్, అలంపూర్, వెలుగు: అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉంటోందన్న సీఎం కేసీఆర్ హామీ అనాథగా మిగిలిపోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నాగులపల్లి తండా, నర్సాయిపల్లి, బాడిగదిన్నె గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను శుక్రవారం పరామర్శించారు.అనంతరం పిల్లలతో పాటు అడిషనల్ కలెక్టర్ మోతీలాల్‌ను కలిసి వారి పరిస్థితిని వివరించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. వారి ఇండ్లు శిథిలావస్తకు చేరాయని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అనంతరం గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో కుమ్మరి జమ్మన్న, శాంతమ్మ దంపతులు చనిపోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లలను పరామర్శించారు. సీఎం హామీలిచ్చి ఏండ్లు గడుస్తున్న పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కనీసం అనాథ పిల్లలను ఆదుకునే తీరిక లేదా..? అని ప్రశ్నించారు.
పక్కాగా జోగులాంబ బ్రహ్మోత్సవాలు
అలంపూర్, వెలుగు: జవనరి 22 నుంచి 26 వరకు జరిగే జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పక్కాగా నిర్వహిస్తామని పాలకమండలి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఈవో పురంధర్ కమార్‌తో కలిసి పాలకమండలి, ధర్మకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్, అభిషేకాలు, అమ్మవారి నిజరూప దర్శనం, ప్రముఖుల ప్రవచనాలు, ఎల్ఈడీ టీవీ ఏర్పాటు, ప్రసాదాల తయారీ, భక్తుల దర్శన ఏర్పాట్లపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండల సభ్యులు జయన్న, అనంత ఈశ్వర్ రెడ్డి, ఉషాదేవి, చిన్నకృష్ణయ్య, మద్దిలేటి, హరిబాబు, నటరాజ్ యాదవ్, ఆనంద్ శర్మ, ఆలయ సిబ్బంది శ్రీనివాసులు, రంగనాథ్ బ్రహ్మయ్య ఆచారి పాల్గొన్నారు.
జోగులాంబ పేరిట రూ.1.25 కోట్లు ఎఫ్‌డీ
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల అభివృద్ధి కోసం రూ. 1.25 కోట్లను శుక్రవారం ఏపీజీవీబీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్టు ఆలయ పాలకమండలి చైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్ సహకారంతో రూ. 1.25 కోట్లను ఎఫ్‌డీ చేయగలిగామని వివరించారు.
డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
మరికల్, నర్వ, వెలుగు: టీచర్లు డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ‘పేట’ కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. శుక్రవారం నర్వ మండలం రాయికోడ్, పాతర్చేడ్, ఉందేకోడ్, మరికల్ మండలం చిత్తనూర్ గ్రామాల్లోని అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిత్తనూర్ స్కూళ్లలో టీచర్ల రిజిస్టర్‌ను పరిశీలించిన ఆయన హెచ్ఎం రాదమ్మ విధులకు గైర్హాజరు కావడంతో సస్పెండ్ చేయాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సాయంతో పాఠాలు చెప్పాలని టీచర్లను కోరారు. నర్వ మండల పరిధిలోని స్కూళ్లలో మన ఊరు–మనబడి కింద చేపట్టిన పనులు పరిశీలించి.. త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీర్లకు సూచించారు.విద్యుత్, ప్లోరింగ్, మరుగుదొడ్లు, పేయింటింగ్, ప్రహరీ నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లో ఫర్మిచర్, గ్రీన్ చాక్ బోర్డులు ఇస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన చోట వెంటనే బిల్లులు ఇవ్వాలని డీఈ, ఏఈలను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, డీఈ రాము, ఏఈ శ్రీకాంత్, ఎంపీడీవోలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.