ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్​నగర్​, వెలుగు : ఎనిమిదేళ్లుగా తాము చేస్తున్న అభివృద్ధిని  ఓర్వలేక కొందరు బీజేపీ లీడర్లు గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ఆరోపించారు. మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహబూబ్​నగర్ మున్సిపల్ పరిధిలోని ఎదిరలో 57 సంవత్సరాలు దాటినా 104 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ చేశారు. ఇదే వార్డుకు చెందిన యూపీఎస్​ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ విద్యాలయగా ఎంపిక కావడంతో హెచ్​ఎం హేమచంద్రను మంత్రి సన్మానించారు. అలాగే వార్డుకు చెందిన రైతు బి.కిష్టయ్యకు చెందిన మూడు బర్రెలు కరెంటు షాక్​తో చనిపోగా, బాధిత రైతుకు రూ.1.20 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. అనంతరం జడ్పీలో 160 మందికి రూ. 79.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు ఎదిర అంటే ఏరిపారిసినట్లు ఉండేదని, ఫ్లోరైడ్ సమస్యతో స్థానికులు అవస్థ పడేవారని గుర్తు చేశారు. రూ.9 కోట్లతో తాగునీటిని తీసుకొచ్చామని చెప్పారు. సమీపంలోనే ఐడీ కారిడార్ నిర్మించామని, అక్కడ భూములు కోల్పోయిన వారికి అత్యధికంగా రూ.12 లక్షల పరిహారం ఇచ్చామన్నారు. త్వరలోనే ఐటీ కారిడార్ ను ప్రారంభిస్తున్నామని, ఐదు వేల మందికి మందికి  శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడే వారికి  ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్థరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ఎస్. వెంకట్‌ రావు,  అడిషనల్‌ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్  పాల్గొన్నారు.

చట్టం ముందు అందరూ సమానులే: హైకోర్టు జడ్జి నవీన్​రావు

నారాయణపేట, వెలుగు: చట్టం ముందు అందరూ సమానమేనని పేద, ధనిక తారతమ్యం లేకుండా న్యాయ సేవలు అందిస్తున్నామని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు జస్టిస్ పి. నవీన్ రావు చెప్పారు.  శనివారం  నారాయణపేట జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్‌ భవనంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ ఒంటరి మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, అన్ని వర్గాల పేదలకు సమన్యాయం అందించేందుకు నేషనల్, రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండల స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు.  రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు14 వందల లీగల్ అవేర్నెస్‌ క్యాంపులు నిర్వహించామని, స్కూళ్లు, జైళ్లలోనూ కమిటీలు వేశామని చెప్పారు. 

8 లక్షల కేసులు పెండింగ్‌

రాష్ట్రంలో దాదాపు 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని పరిష్కరించాలంటే దాదాపు 10 ఏండ్లు పట్టే  అవకాశం ఉందన్నారు.  చిన్నచిన్న తగాదాలకు కూడా కోర్టులకు వెళ్లి ఏళ్ల తరబడి కోర్టుల చట్టూ తిరుగుతున్నాయని,  ఇరువర్గాలు రాజీ కుదుర్చుకునేందుకు  వీలుగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు.  లోక్ అదాలత్ ద్వారా ఇప్పటి వరకు రూ. 280 కోట్ల నష్ట పరిహారం అందించామన్నారు. అనంతరం గ్రామీణ మహిళా సంఘాలకు రూ. 5 కోట్ల చెక్కు, పట్టణ మహిళా సమాఖ్యకు రూ.  3.21 కోట్ల చెక్కు, గొర్రెల పెంపకం దారులకు రూ. 2.24 కోట్ల చెక్కుతో పాటు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. అంతకు ముందు జిల్లా కోర్టు భవనానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ హరిచందనతో కలిసి పరిశీలించారు. మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కె. లక్ష్మణ్, నారాయణపేట ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మొహమ్మద్ అబ్దుల్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా జడ్జి జస్టిస్ ప్రేమావతి,  సీనియర్ సివిల్ జడ్జి వి. శ్రీనివాస్,  స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు,  కలెక్టర్ హరిచందన, ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తం: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా ఉన్న 300 మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.  జిల్లా జర్నలిస్టులు శుక్రవారం రాత్రి మంత్రిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఉన్న స్టేను సుప్రీం కోర్టు ఎత్తేయడంతో  ఇండ్ల స్థలాల కేటాయింపునకు మార్గం ఏర్పడిందన్నారు. త్వరలో అర్హులైన జర్నలిస్టులందరికీ  డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని మాటిచ్చారు.  కొత్త కలెక్టరేట్‌ సమీపంలో జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.  జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని జర్నలిస్టులు సహకరించాలని కోరారు.  అనవసర బ్రేకింగ్‌లకు పోకుండా  క్రెడిబిలిటీ కలిగిన వార్తలు రాయాలని సూచించారు. జర్నలిస్ట్ సంఘం నాయకులు బక్షి శ్రీధర్ రావు, పోతుల రాము, నగేశ్,  జాని, ఎండీ పాషా, భాను ప్రకాష్, నిరంజన్ , ఆనంద్, రమేశ్, రహీం, గోపి  పాల్గొన్నారు.

మక్తల్‌లో కోర్టు ఏర్పాటు చేయండి

మక్తల్, వెలుగు:  మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్‌‌పర్సన్‌ పావని, వైస్​ చైర్‌‌పర్సన్‌ అఖిలరాజశేఖర్​రెడ్డి  హైకోర్టు జస్టిస్​లక్ష్మణ్‌ను కోరారు.   శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మేగా లీగల్ అవేర్నెస్ కార్యక్రమానికి చీఫ్‌ గెస్టుగా వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా, మాగనూరు, నర్వ , మండలాల నుంచి  జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని వాపోయారు.  నియోజకవర్గంలో దాదాపు 2500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని,  మున్సిపాలిటీలో కోర్టు ఏర్పాటు చేసి తమ ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బలరాం రెడ్డి,  బాల్చేడ్ మల్లికార్జున్‌ ఉన్నారు.

శాఖల మధ్య కోఆర్డినేషన్‌ కీలకంజిల్లా జడ్జి రాజేశ్ బాబు 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  బాధితులకు సత్వర న్యాయం అందాలంటే ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని  నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి రాజేశ్‌ బాబు సూచించారు. శనివారం కోర్టు ఆవరణలో న్యాయ, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టుల్లో చార్జిషీట్ దాఖలు చేయడంపై పలు సూచనలు చేశారు.  శాఖ స్వాధీనం చేసుకున్న ఆస్తులను 24 గంటల్లోగా కోర్టుకు సబ్మిట్ చేయాలన్నారు. ముద్దాయిల వయసు నిర్ధారణకు ఆధార్‌‌ కాకుండా టెన్త్‌ మెమో, డాక్టర్ నిర్ధారించిన సర్టిఫికెట్‌ను తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు జిల్లాలో పర్యటించేటప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని ఆదేశించారు.  సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ జడ్జి  స్వరూప, అడిషనల్ జూనియర్ జడ్జి కీర్తి సింహ,  ఎస్పీ మనోహర్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, పీపీ శ్యాం ప్రసాద్, డీఎఫ్‌వో రోహిత్ రెడ్డి,  ఏఎస్పీలు రామేశ్వర్, భరత్, ఆర్డీవో పాండు నాయక్ ఉన్నారు. 

అర్చకులకు 200 గజాల జాగా ఇవ్వాలి
అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్‌‌ శర్మ

అలంపూర్,  వెలుగు: దేవదాయశాఖ కింద పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు 200 గజాల నివాస స్థలాలు ఇవ్వాలని ఆ సంఘం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. శనివారం జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ‘అర్చక ఉద్యోగులతో ఆత్మీయ పలకరింపు’ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్చకుల కష్ట సుఖాలను తెలుసుకునేందుకు యాత్ర ప్రారంభించానని,  సకాలంలో రాక వేతనాలు కొందరు..  గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ వేతనాలు రాక మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.   2016 నుంచి పని చేసే వారందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ వేతనాలు,  ప్రస్తుతం జీఐఏ వేతనాలు పొందుతున్న వారికి జీపీఎఫ్‌ ఇవ్వాలని కోరారు. ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్, పదవీ విరమణ అనంతరం ఫెన్షన్ విధానం  వర్తింపజేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, జోగులాంబ ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగనాథ్,  ప్రదీప్,  శ్రీను,  బ్రహ్మయ్య, శేఖర్ పాల్గొన్నారు. 

ఆర్వోబీలోకి నీళ్లునిలిచిన రాకపోకలు 

జడ్చర్ల, వెలుగు:  జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోని ఆర్వోబీలో శనివారం కురిసిన వర్షానికి  నీళ్లు నిలిచాయి. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. సమీపంలో ఉన్న కుంట అలుగు పారుతుండడంతో ఆ నీళ్లన్ని బ్రిడ్జి కిందకు వచ్చి చేరుతున్నాయి.  ప్రస్తుతం 7 ఫీట్ల మేర నీళ్లు ఉండడంతో  గొల్లపల్లి గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు.   అలాగే జడ్చర్ల పట్టణంలోని బాబా నగర్, రాజీవ్​నగర్, శివాజీ నగర్​తో పాటు పలు కాలనీల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. 

రంగాపూర్‌‌ను మండలం చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వెల్దండ మండల పరిధిలోని రంగాపుర్‌‌ను మండల ం చేయాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నేతలు డిమాండ్ చేశారు.  శనివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌  ఝాన్సీ మాట్లాడుతూ  గ్రామ జనాభా పరంగా, వర్తక, వాణిజ్య పరంగా రంగాపూర్‌‌ వంగూరు మండలం కన్నా ఎన్నో రెట్లు పెద్దదన్నారు.  రంగాపూర్‌‌తో చుట్టుపక్కల గ్రామాలైన పోల్కంపల్లి, కోనాపూర్, మిట్టసదగోడు, ఉల్పర, రంగాపూర్ తండా, పోతిరెడ్డిపల్లి సర్పంచులు తమ గ్రామాలను కొత్తగా ఏర్పడిన రఘుపతి పేట మండలంలో కలుపొద్దని తీర్మానం చేశారని చెప్పారు.  అనంతరం అడిషనల్ కలెక్టర్ మోతిలాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. కోనాపూర్ సర్పంచ్‌  పరశురాములు, నేతలు సురేందర్, ఆనంద్ రెడ్డి, మల్లేశ్, రామకృష్ణారెడ్డి, రామస్వామి, శరత్ రెడ్డి  పాల్గొన్నారు.   

8 మంది సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు

శ్రీరంగాపూర్, వెలుగు: శ్రీరంగాపూర్‌‌ మండల పరిధిలో పనిచేస్తున్న 8 మంది  పంచాయతీ  సెక్రటరీలకు డీఆర్‌‌డీవో నర్సింహులు  షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నవంబర్‌‌ 2021 నుంచి మార్చి 2022 వరకు చేపట్టిన ఉపాధి హామీ  పనులపై శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులతో పాటు  హరితహారం పనుల్లో నిర్లక్ష్యాన్ని గుర్తించిన డీఆర్‌‌డీవో ఎనిమిది గ్రామాల సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.   రూ.8,249  రికవరీ  చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ ఆఫీసర్​ రహీం, ప్రొసీడింగ్​ఆఫీసర్​ కృష్ణయ్య,  ఎంపీపీ గాయత్రిపృథ్వీరాజ్​, వైస్​ ఎంపీపీ మహేశ్వర్​ రెడ్డి, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్​ యాదవ్ తదితరులు  పాల్గొన్నారు.