
చేవెళ్ల, వెలుగు: తెలంగాణ యుద్ద వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని గురువారం చేవెళ్లలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రైతులకు, గొల్ల, చాకలి, కుమ్మరి, మంగళి వంటి అనేక కులాలకు రక్షణగా నిలిచిన మహానుభావుడు పాపన్న అని పేర్కొన్నారు. జనగామ వద్ద 25 గొలుసుకట్టు చెరువులను తవ్వించిన మహాపరిపాలకుడని, 33 కోటలను జయించి.. భువనగిరి కోట నుంచి వరంగల్ కోట వరకు విస్తరించాడన్నారు.
లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీలో ఆయన చరిత్ర ఉందని తెలిపారు. కాకతీయులను తరిమికొట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వాయి పాపన్న జయించాడని గుర్తుచేశారు. అయితే, మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడుతుండగా ఓ వ్యక్తి లేచి నిలబడి.. ‘ మీ పార్టీ గురించి కాదు.. పాపన్న చరిత్రను మాత్రమే మాట్లాడాలి. ఇది మీ పార్టీ సమావేశం కాదు. పాపన్న విగ్రహాష్కరణ సమావేశం..’ అంటూ అడ్డుకున్నాడు. ఈ విగ్రహ ఆవిష్కరణలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య,మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.