నాగర్‌కర్నూల్, వెలుగు: గౌడ బిడ్డలకు ఆపదొస్తే తాను అండగా ఉంటానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ‘జై గౌడ్ ఉద్యమం’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, ఆశయాలను ప్రజలకు తెలియకుండా కుట్ర చేశాయని ఆరోపించారు. పాపన్న అన్ని కులాల ఎదుగుదల కోసం ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. గీతవృత్తిని ప్రోత్సహించడంతో పాటు గౌడ్ సంఘం భవనాలకు నిధులు ఇస్తున్నామన్నారు. ఎవరికి సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అన్నారు.
అన్ని హంగులతో కోర్టు భవనం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కోర్టు కొత్త భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బండమీది పల్లిలో కోర్టు నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని సోమవారం అధికారులు, అడ్వకేట్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత కోర్టు భవనంలో సరైన వసతులు లేక 20 ఏళ్లుగా అడ్వకేట్లు, జడ్జిలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు చెప్పగానే.. పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తుచేశారు. ప్రస్తుతం నిర్మించనున్న భవనానికి బైపాస్‌తో పాటు మహబూబ్ నగర్ టౌన్ వెళ్లే రోడ్డు, రాయచూరుకు వెళ్లే మరో రోడ్డు దగ్గరగా ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి ఇబ్బంది కలగకుండా అదనపు స్థలం కేటయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ కుమార్, పీపీలు బెక్కెం జనార్ధన్, స్వదేశ్ కుమార్, మనోహర్, బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కార్యదర్శి లక్ష్మారెడ్డి, అడిషనల్ పీపీ మురళీకృష్ణ, అడ్వకేట్లు హనుమంతు, ఉమామహేశ్వరి, శశిధర్, రవీందర్ నాయక్, లైబ్రరీ సెక్రటరీ నర్సింహులు, సొసైటీ అధ్యక్షుడు రవి ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
ఒకే వేదికపై బీరం, జూపల్లి
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు ఎవరికి వారుగా ప్రోగ్రామ్‌లు చేయడం మొదలు కొని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. మంత్రి కేటీఆర్ వచ్చి పంచాది తెంపే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. కొన్నాళ్లుగా పోలీసుల సాయంతో జూపల్లి వర్గాన్ని టార్గెట్ చేస్తుండడంతో ఆయన అధికార పార్టీపై బహిరంగంగా విమర్శలు చేశారు. తనదారి చూసుకుంటానని హెచ్చరించారు. కానీ, పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ వేదికపై ఇద్దరు కనిపించడంతో ఏం జరుగుతుందోనని మళ్లీ చర్చ మొదలైంది.