తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 7,900 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 90 నియోజకవర్గాల్లో ఇండోర్ స్టేడియం సాంక్షన్ చేసుకోగా... 45 ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. గతంలో ప్లే గ్రౌండ్లలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని ఆయన చెప్పారు. క్రీడల పట్ల ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉందని అందుకే.. క్రీడా అకాడమీలకు ఎంతో ప్రోత్సహమిస్తున్నామని తెలిపారు. అలాగే.. స్పోర్ట్స్ స్కూళ్లలో మెస్ ఛార్జీలు పెంచి మంచి ఆహారం అందిస్తున్నామన్నారు.
రూ. 750 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామన్నారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకుని దేశంలోనే అత్యధిక మెడికల్ కళాశాలలున్న రాష్ట్రంగా ఎదిగామని అన్నారు. డాక్టర్ కావాలి అనుకునే వారికి ఇప్పుడు ఎంతో సులభం అవుతుందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇండియా సాధించిన పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది క్రీడాకారులు ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఒలింపిక్ గోల్డ్ కొట్టింది కూడా మనవాళ్లేనన్నారు. ఇక ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. క్రీడా పాలసీని కూడా నియమించామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ స్కూళ్లలో అదనపు కోచ్‌లను నియమించి.. ఇప్పుడు ఉన్నవారికి వేతనాలు పెంచి ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.