చౌటుప్పల్, వెలుగు: కాబోయే సీఎం కేటీఆరే అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడులో ఓట్లు అడుగుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఆయన ప్రచారం చేస్తున్నారు. మంగళవారం తాళ్లసింగారం పరిధిలోని కొత్తపేటలో ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రచార పోస్టర్‌లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను ప్రజలకు చూపిస్తూ... ‘‘ఈయన (కేసీఆర్) సీఎం. కాబోయే సీఎం ఈయన (కేటీఆర్). కాబోయే సీఎం మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నరు. మీరు టీఆర్ఎస్ కు ఓటేసి గెలిపించాలె’’ అని మంత్రి కోరారు. ‘‘కేటీఆరే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రే మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నరు. కాబట్టి అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి” అని ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మంత్రి బాటలోనే మరికొందరు టీఆర్ఎస్ నేతలూ నడుస్తున్నారు. కాబోయే సీఎం కేటీఆరే అంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. కాగా, మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించిన టీఆర్‌ఎస్.. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్ గా నియమించింది. 10 మందికి పైగా మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌లు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆ రోజు నుంచి ‘‘నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకున్నారు. కాబోయే సీఎం ఆయనే. మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు” అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.