మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం టూరిజం, స్పోర్ట్స్, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రూ.125 కోట్ల విలువైన పనులకు మహబూబ్ నగర్ కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. గత రెండేండ్లలో పర్యాటక శాఖ ద్వారా రూ.2,400 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సస్పెన్షన్ బ్రిడ్జిలు రాష్ట్రంలో ఏడు చోట్ల నిర్మించామన్నారు.
‘రోప్ వే ప్రపోజల్ తిరస్కరించిన్రు’
మహబూబ్ నగర్ రూరల్: మన్యంకొండ రోప్ వే కోసం ప్రసాద్ స్కీం ద్వారా నిధుల కోసం కేంద్రానికి పంపిన ప్రపోజల్స్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరస్కరించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రూ.50 కోట్లతో మన్యంకొండ అలివేలు మంగ ఆలయ సమీపం నుంచి కొండ మీదికి నిర్మించే రోప్ వే, కొండపై నిర్మించే స్కైవాక్, అన్నదాన సత్రం తదితర పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మొదటి రోప్ వేను మన్యంకొండ ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదిలోగా రోప్ వే పనులను పూర్తి చేస్తామని చెప్పారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండీ మనోహర్, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధా శ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనిత పాండురంగారెడ్డి పాల్గొన్నారు.