హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీపై కొంతమంది ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న కళాకారులు చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది తమ టాలెంట్ తో సినీరంగంలోనూ రాణిస్తున్నారని అన్నారు. మంచి ప్రతిభ ఉన్నవారిని గుర్తించి, ప్రోత్సహిస్తామని చెప్పారు. A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మించిన ‘అన్‌స్టాపబుల్’ మూవీలోని ‘దేశ్ కా నేత’ ప్రత్యేక సాంగ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ థియేటర్ లో ఆవిష్కరించారు.
గతంలో కొంతమందికి, కొన్ని కుటుంబాలకు మాత్రమే సినీ పరిశ్రమ వారస్వతంగా ఉండేదని, కానీ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలో అందరికీ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రాలను సినిమా షూటింగులకు వినియోగించూకోవాలని కోరారు.