- ప్రైవేట్ స్కూల్ టీచర్లతో నేడు శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమం
- 450 పాఠశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు
- పిల్లలను బడులకు పంపవద్దని పేరెంట్స్ కు వాట్సాప్ మెసేజ్
- స్పందించని డీఈవో
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించబోయే ఆత్మీయ సమ్మేళనం కోసం పాలమూరు జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లన్నీ సోమవారం సెలవు ప్రకటించాయి. పిల్లలను స్కూళ్లకు పంపవద్దంటూ పేరెంట్స్‌కు రెండు రోజులుగా యాజమాన్యాలు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ టికెట్లు కన్ఫర్మ్ అయిన ఎమ్మెల్యేలంతా మరోసారి కుల సంఘాలు, వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లతో మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 450 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 20 వేలకుపైగా టీచర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పటికే మంత్రి నుంచి ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు అందాయి. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని, బదులుగా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని మంత్రి
కోరుతున్నారు. దీంతో అన్ని ప్రైవేట్ స్కూళ్ల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు పాల్గొంటున్నారు. దీంతో స్కూళ్లకు సోమవారం సెలవు ఇస్తున్నట్లు శని, ఆదివారాల్లో పేరెంట్స్‌కు యాజమాన్యాలు వాట్సాప్ లో మెసేజ్‌లు పెట్టాయి.
సోమవారం సెలవుపై పేరెంట్స్ ఫైర్
సమ్మేళనానికి ఆదివారం కాకుండా పనిదినమైన సోమవారం నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల పేరుతో గత నెలలో దాదాపు వారం సెలవులిచ్చారని, ఇప్పటికే సిలబస్ కాక ఇబ్బందిపడ్తుంటే మళ్లీ హాలిడే ఇవ్వడమేమిటని పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. కాగా, ప్రైవేట్ స్కూళ్లకు డీఈఓ అనుమతితోనే హాలిడే ప్రకటించారా? అసలు ఆయనకు సమాచారం ఉందా అన్న విషయం కూడా తెలియట్లేదు. వివరణ తీసుకునేందుకు డీఈవో రవీందర్‌కు ‘వెలుగు’ ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. మెసేజ్ పంపినా స్పందన లేదు.
మా సమస్యలు పరిష్కరించాలి
ప్రైవేట్ స్కూల్ టీచర్లు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మాకు ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా అందడం లేదు.
మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆదివారం ఫంక్షన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం నిర్వహించాల్సి వస్తోంది.
-
ప్రభాకర్, ట్రస్మా మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు