
- వడాయిగూడెం గ్రామస్థులను ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ఇంకోసారి తప్పక పెట్టాలని సూచన
యాదాద్రి, వెలుగు: ‘మీ గ్రామానికి నిధులు ఇస్తోంది సీఎం కేసీఆర్. ఇక్కడ రోడ్లు వేసింది, పింఛన్లు ఇస్తున్నది కూడా ఆయనే. అలాంటప్పుడు ఫ్లెక్సీలో ఆయన ఫొటో పెట్టరా?’ అని యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామస్థులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఊర్లో ఇంకోసారి ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా కేసీఆర్ ఫొటో పెట్టాలని సూచించారు. శనివారం వడాయిగూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జై తెలంగాణ అంటే కాల్చిన్రు
‘ఉమ్మడి ఏపీలో జై తెలంగాణ అంటే కాల్చి చంపారు. మళ్లిప్పుడు తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఉద్యమకారులుగా మేము చూస్తూ ఊరుకోం’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన మహాత్మాగాంధీ, అంబేద్కర్, సర్వాయి పాపన్న లాంటి నాయకులకు కులాలు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు పోతేనే సమానత్వం వస్తుందన్నారు. శివాజీతో సమానంగా పరాయి పాలకులపై పోరాడిన పాపన్నను ఆంధ్ర పాలకులు గుర్తించలేదన్నారు. భువనగిరి మండలంలోని నందనంలో రూ.6 కోట్లతో నీరా ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రాసెస్ నడుస్తోందని తెలిపారు. ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.