నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ శాఖ -మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్–-143 యూనియన్ ఉమ్మడి జిల్లా ద్వితీయ వార్షికోత్సవ మహాసభకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 7 వేల అక్రిడిటేషన్ కార్డులు ఉంటే ప్రస్తుతం 20 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, అందుకే సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీకి రూ.42 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నిధులపై వచ్చే వడ్డీతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. కొందరు యూట్యూబ్ చానల్స్ పెట్టుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని సూచించారు.
కరోనా టైమ్‌లో ఎంతో మందికి సాయం
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. యాక్సిడెంట్ లో గాయపడిన 150 మంది జర్నలిస్టులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని, వివిధ కారణాలతో మరణించిన 475 మంది జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో ఇచ్చిన మాట ప్రకారం.. అన్ని జిల్లాల్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఉయ్యాలవాడలోని మెడికల్ కాలేజీ దగ్గర 4 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్ పర్సన్ శాంతాకుమారి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ప్రెస్ అకాడమీ సెక్రటరీ మారుతి సాగర్, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్, టీయూడబ్ల్యూజే జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా, నేతలు యోగి, వెంకటయ్య పాల్గొన్నారు.