మే 6న ఐటీ టవర్ ప్రారంభిస్తాం

మే 6న ఐటీ టవర్ ప్రారంభిస్తాం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా టెకీలకు ఉపాధి కల్పించేందుకు వచ్చే నెల 6న మహబూబ్ నగర్ లో ఐటీ టవరన్​ను ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు రూ.50 కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్, కాంప్లెక్స్​ పనులను కలెక్టర్  గుగులోత్​ రవినాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా బస్టాండ్  పక్కనే ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్  బ్రాండ్స్  షోరూం, ఐ మాక్స్ థియేటర్  పనులను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఐటీ టవర్ ను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్  రానున్నట్లు చెప్పారు.

జిల్లాను పర్యాటకంగా డెవలప్​ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మన్యంకొండలో రోప్ వే వస్తుందని, అక్కడ బడ్జెట్  హోటల్  నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి కొత్త ప్రాజెక్టును మహబూబ్ నగర్ లో ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్  చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాల్యానాయక్, అడిషనల్  కలెక్టర్  సీతారామారావు, మున్సిపల్ చైర్మన్  కేసీ నర్సింలు, వైస్  చైర్మన్  గణేశ్, గ్రంథాలయ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్  గంజి వెంకటన్న పాల్గొన్నారు.