మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు జిల్లా రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఏకైక లక్ష్యంతో తాను పని చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని టీడీ గుట్ట కమ్యూనిటీ హాల్లో 13 ,15, 34, 45 వ వార్డుల్లో ఆసరా పింఛన్లు పొందిన లబ్ధిదారులకు సోమవారం పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో మహబూబ్‌నగర్‌కు పింఛన్ల కింద కేవలం రూ.31 లక్షలు ఇచ్చేవారని, తెలంగాణ వచ్చాక ఇప్పుడు రూ. 3.20 కోట్లు ఇస్తున్నామన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రాకుంటే అప్లై చేసుకోవాలని సూచించారు. టీడీగుట్ట, వీరన్నపేటలో కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 17 ఏళ్లు దాటిన మహిళలను గుర్తించి శిక్షణ ఇప్పించాలని మున్సిపల్ కమిషనర్‌ఆదేశించారు. అంతకు ముందు తెలంగాణ చౌరస్తా సమీపంలోని డీసీసీబీ ఆడిటోరియంలో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభలకు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే జర్నలిస్టులు సమాజానికి గొప్ప సేవకులని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పాల్గొన్నారు.
పింఛన్లు ఇస్తలేరని కౌన్సిలర్ రాజీనామా
అయిజ, వెలుగు: తన వార్డులోని అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని అయిజ మున్సిపాలిటీలోని 10వ వార్డు(దుర్గానగర్) కౌన్సిలర్ మేకల అనిత(టీఆర్‌ఎస్) రాజీనామా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ వార్డులో 280 మంది అర్హులుంటే ప్రభుత్వం కేవలం 14 మందికి మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేసిందని వాపోయారు. తాను గెలిచి మూడేండ్లైనా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించలేక పోయానన్నారు. ఎమ్మెల్యేను కలిసినా, మున్సిపల్ జనరల్ బాడీకి దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదన్నారు. అభివృద్ధి చేయని పదవి ఎందుకని, అందుకే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మండలానికో గోదాం నిర్మిస్తున్నం:వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన విధానాల కారణంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని, ఇందుకు తగ్గట్టుగా మండలానికో గోదాం నిర్మిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. సోమవారం ఖిల్లాఘనపురం, పాన్ గల్ , కొల్లాపూర్ మండలాలతో పాటు వనపర్తి సమీపంలోని చిట్యాల శివారులో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. గతంలో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయేవారని వాపోయారు. ప్రస్తుతం మండల కేంద్రాల్లో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదామలును నిర్మిస్తున్నామని చెప్పారు. పంటలను ఇందులో నిల్వ చేసుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చన్నారు. గోదామలు నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. పాల్గొన్న జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్, వేర్ హౌస్ మేనేజర్ కే. కవిత, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, సర్పంచ్ భాను ప్రకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంగ్లీష్ మీడియం టీచర్లేరి?
కలెక్టరేట్లను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
నారాయణపేట, నాగర్ కర్నూల్ టౌన్, మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్ సంబంధిత టీచర్లను ఎందుకు నియమించడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ప్రశించారు. సోమవారం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. నాగర్ కర్నూల్‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.రవి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని నిలదీశారు. పెండిగ్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో స్టూడెంట్లు చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా సరిపడా పాఠ్యపుస్తకాలు, టీచర్ల లేరని మండిపడ్డారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులు చేసి వంట వండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనేక స్కూళ్లలో టాయిలెట్స్, బాత్రూమ్స్, తాగునీరు కూడా లేదని వాపోయారు. ఎస్‌ఎఫ్‌ఐ నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట అధ్యక్షులు సయ్యద్, ప్రశాంత్, మోహన్, కార్యదర్శులు తారా సింగ్, భరత్, నరహరి నేతలు నరసింహ, కాశి, నేతలు శ్యామల, వెంకటేశ్ , పవన్, మహేశ్, నరేశ్, అఖిల, కార్తీక్, గణేశ్, అరవింద్, రవి, నందు, రాము, త్రినాథ్, రమాదేవి, మనీష, మాణిక్యప్ప పాల్గొన్నారు.
ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలి:కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, వెలుగు: స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లాలో గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛ భారత్‌పై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓడీఎఫ్ ప్లస్ లక్ష్యంగా జిల్లాలో 20 గ్రామాలను ఎంపిక చేసి పారిశుద్ధ్య పనులను చేపట్టామన్నారు. త్వరలోనే కేంద్ర బృందం పర్యటించనుందని, ఆలోగా లక్ష్యం పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించి 100 శాతం వినియోగించేలా అవగాహన కల్పించాలని, బహిరంగ ప్రదేశాల్లో కమ్యూనిటీ డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, వేణుగోపాల్, డీఆర్డీవో నరసింహులు, అడిషనల్ డీఆర్డీవో కృష్ణయ్య పాల్గొన్నారు.
అధికారులు సమస్యలపై స్పందించాలి:ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
ఉప్పునుంతల(వంగూర్), వెలుగు: అధికారులు నివేదికలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సమస్యలపై స్పందించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సూచించారు. సోమవారం వంగూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ భీమమ్మ లాలూ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌కు ఎంపీ రాములుతో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె దావఖానాలపై మెడికల్ ఆఫీసర్ కృష్ణను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి పల్లెదవాఖానాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీటింగ్ జరుగుతుండగానే తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని రంగాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. స్పందించిన ఎమ్మెల్యే జనరల్ బాడీలో తీర్మానం చేసి పంపిస్తామని హామీ ఇచ్చారు.
భూసమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్:కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణికి వచ్చే అప్లికేషన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేసి చేయాలని సూచించారు. ఇందులో ఎన్ని పరిష్కరించారో ఎప్పటికప్పుడు రిపోర్టు పంపాలని ఆదేశించారు.
గణేశ్ ఉత్సవాల్లో ఇబ్బందులు రానివ్వొద్దు
గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఎస్పీ రంజన్ రతన్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్రీహర్షతో కలిసి జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. నిమజ్జనం చేసే నది అగ్రహారం, బీచుపల్లి దగ్గర భారీ కేడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయడంతో పాటు రూల్ రోడ్లకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం రోజు వైన్స్‌లు క్లోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదయ్యను ఆదేశించారు.
చిన్నరేవల్లి-–-బాల్‌నగర్‌కు డబుల్ లేన్ రోడ్డు వేయాలి:టీపీసీసీ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి
బాలానగర్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలంలోని చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, గౌతపూర్ గ్రామాల మీదుగా బాలానగర్ వరకు డబుల్ లేన్ రోడ్డు వేయాలని టీపీసీసీ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిన్నరేవల్లి నుంచి బాలానగర్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 కిలోమీటర్లు మేర రోడ్డంతా గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ ఏరియాలో కంకర పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పెద్ద పెద్ద బండ్లు వెళ్లి తరచూ గుంతలు పడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే రోడ్డును వేయాలని లేదంటే ప్రజలందరినీ కూడగట్టి ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. రెండు నెలల క్రితం తహసీల్దార్ శ్రీనివాస్ గౌతపూర్ గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులు ఇస్తామని పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చినా... ఇంత వరకు అతీగతీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తి చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ప్రజాపంథా నేతలు
బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు
నారాయణపేట, వెలుగు: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని సీపీఐ ఎంఎల్ప్రజాపంథా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేటలోని అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, పాత బస్టాండ్, మీదుగా ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరగా కోపరేటివ్ బ్యాంక్ ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కార్యకర్తలు బారికేడ్లును తొలగించి ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కార్యదర్శి బి. రాము మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పేద ప్రజలపై ధరల భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం సరికాదని, వెంటనే జీఎస్టీ తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె. కాశీనాథ్, పార్టీ నేతలు నరసింహ, జయలక్ష్మి (సర్పంచ్), ప్రశాంత్, చెన్నారెడ్డి, కొండ నర్సిములు , భగవంతు, జీ వెంకట్ రాములు, కె. సునీత (ఎంపీటీసీ), సౌజన్య, లక్ష్మి, సంధ్య, హాజీ ,అంజి, సాయి, దామోదర్ , భాస్కర్, గణేష్, నర్సింహులు, సలీం, నర్సింగ్ ఉన్నారు.
ఎమ్మెల్యేల సమక్షంలోనే పింఛన్లు ఇవ్వండి:కలెక్టర్ వెంకట్‌రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే సమక్షంలో పంపిణీ చేయాలని ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లను కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం రెవెన్యూ మీటింగ్ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల దగ్గరకు స్వయంగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 147 మంది అర్జీలు పెట్టుకోగా కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పెన్షన్ కార్డుల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం వెంటనే స్థలాలు గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జడ్పీ సీఈవో జ్యోతి, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, సీపీవో దశరథ్ హాజరయ్యారు.
పింఛన్లు ఇస్తలేరని కౌన్సిలర్ రాజీనామా
అయిజ, వెలుగు: తన వార్డులోని అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని అయిజ మున్సిపాలిటీలోని 10వ వార్డు(దుర్గానగర్) కౌన్సిలర్ మేకల అనిత(టీఆర్‌ఎస్) రాజీనామా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ వార్డులో 280 మంది అర్హులుంటే ప్రభుత్వం కేవలం 14 మందికి మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేసిందని వాపోయారు. తాను గెలిచి మూడేండ్లైనా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించలేక పోయానన్నారు. ఎమ్మెల్యేను కలిసినా, మున్సిపల్ జనరల్ బాడీకి దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదన్నారు. అభివృద్ధి చేయని పదవి ఎందుకని, అందుకే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.