ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గ్రామాల్లో క్రికెట్​ అభివృద్ధికి హెచ్​సీఏ కృషి చేయాలి
మహబూబ్​నగర్, వెలుగు :  హైదరాబాద్​ క్రికెట్​అసోసియేషన్​ (హెచ్​సీఏ) నగరానికే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్​అభివృద్ధికి కృషి చేయాలని  రాష్ర్ట క్రీడా శాఖా మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్​ అన్నారు.  మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని బోయపల్లి రోడ్డులో ఉన్న మహబూబ్​నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎండీసీఏ) గ్రౌండ్స్​లో బుధవారం క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, సర్ఫ్ వికెట్స్, బౌలింగ్ మెషీన్స్​ను  ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డితో కలసి ప్రారంభించారు. అలాగే ప్లేయర్ల కోసం రూ.10 లక్షలతో నిర్మించే డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్​సీఏ కోసం ప్రభుత్వం ఖరీదైన భూమిని అందించిందని గుర్తు చేశారు. దీని ద్వారా భారీగా ఆదాయం పొందుతున్న ఆ సంఘం,  గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించకుండా నిర్లక్ష్యం చేస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెచ్​సీఏ బాధ్యులు  అజహరుద్దీన్​తదితరులతో మాట్లాడినా ఫలితం లేదన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, క్రికెట్ అసోసియేషన్ జిల్లా  ప్రెసిడెంట్​సురేశ్​ పాల్గొన్నారు.

‘సమైక్యత’ కాదు.. విమోచన దినం జరపాలె
    ఏబీవీపీ నేషనల్ సెక్రటరీ హరికృష్ణ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  సెప్టెంబర్​17 ను జాతి సమైక్యత పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారని, ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగానే జరపాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి హరికృష్ణ డిమాండ్  చేశారు. 75 ఏండ్ల తెలంగాణ స్వాతంత్ర్య సంబురాల సందర్బంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జడ్చర్ల  నుంచి చేపట్టిన పాదయాత్ర బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. హాజరైన హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ  ఏర్పడితే సెప్టెంబర్ 17ను అధికారిక స్వాతంత్ర్య దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పి.. మాట మార్చి జాతి సమైక్యత పేరును పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకనుగుణంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపి అమరవీరులకు నివాళి అర్పించాలన్నారు.  ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్, విభాగ్ కన్వీనర్ సందీప్, జిల్లా కన్వీనర్ మనోజ్ పాల్గొన్నారు.  

గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి
మదనాపురం, వెలుగు : గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మదనాపురం మండల కేంద్రంలోని సోషల్​వెల్ఫేర్​గురుకుల స్కూల్​, కేజీవీబీ స్కూల్​ను బుధవారం ఆయన పరిశీలించారు. గురుకులాల్లో తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయ న్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే సమస్యలు  పరిష్కరించకపోతే స్టూడెంట్ల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల నాయకులు మహేందర్ నాయుడు,  కావలి మధులత పాల్గొన్నారు.

అసెంబ్లీని పార్టీ వేదికగా మార్చిన కేసీఆర్

 బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
నారాయణపేట, వెలుగు:  సీఎం కేసీఆర్ అసెంబ్లీని పార్టీ వేదికగా మార్చుకుని విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ ఆరోపించారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర’ లో భాగంగా నిర్వహిస్తున్న బైక్​ ర్యాలీ రెండో రోజు నారాయణపేట మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం నుంచి ప్రారంభం కాగా డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం కోటకొండ గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు గళమెత్తితే ప్రభుత్వ అవినీతి బండారం బయటపడుతుందని మాట్లాడనీయకుండా, అక్రమంగా సస్పెండ్ చేశారన్నారు.  ప్రజా క్షేత్రంలో శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. అవినీతి కుటుంబపాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్​ను ఇంటికి పంపేందుకు సిద్ధం గా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం వాటా ఉందన్నారు. కేంద్రం వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. పథకాలకు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కె.రతంగ్ పాండురెడ్డి, మహబూబ్​నగర్​ పార్లమెంట్ ఇన్​చార్జి డోకూర్​ పవన్​కుమార్​రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు  తదితరులు పాల్గొన్నారు.

సమైక్యతా దినోత్సవాలకు ఏర్పాట్లు చేయండి
వనపర్తి/గద్వాల, వెలుగు: సెప్టెంబర్ 17 సమైక్యతా వజ్రోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో కలెక్టర్ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18  తేదీల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు.  16న  స్టూడెంట్లు, యువతీ, యువకుల ఆధ్వర్యంలో వనపర్తిలో కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడే  అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు సీఎసీ సోమేశ్​కుమార్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఎస్పీ కె.అపూర్వరావు,  అడిషనల్ కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 

వజ్రోత్సవాలను సక్సెస్​ చేయాలి
సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని జడ్పీ చైర్​పర్సన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో హైదరాబాద్​లో సీఎం  ఓపెన్ చేయనున్న ఆదివాసీ భవన్, బంజారా భవన్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. అనంతరం ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తో కలసి జిల్లా  అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో15,000 మందితో ర్యాలీ నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.  అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.

వృద్ధురాలిని నమ్మించి నిలువు దోపిడీ
పెద్దమందడి, వెలుగు: మండల కేంద్రంలో ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి గుర్తు తెలియని దుండగులు  బుధవారం నిలువుదోపిడీ చేశారు. ఎస్సై హరిప్రసాద్​వివరాల ప్రకారం.. దొడగుంటపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మమ్మ గోపాల్​పేట మండలంలోని తిరుమలాపురంలో గల తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు.. ముందరి తండా బస్టాప్​వద్ద బస్సు కోసం ఎదురు చూస్తోంది. అదే క్రమంలో అటుగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు  లక్ష్మమ్మతో మాటలు కలిపారు. భర్త చనిపోయిన మహిళలకు వీరాయపల్లి గ్రామంలో రూ. 3 లక్షలు, క్వింటాల్ బియ్యం ఇస్తున్నారని, మేం అక్కడికే వెళ్తున్నామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన లక్ష్మమ్మ వారి బైక్​ఎక్కింది. వృద్దురాలిని చిన్న మందడి కి వెళ్లే మట్టిదారిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు ఓ చెట్టుకింద ఆపి వారి వెంట తెచ్చిన మద్యం వృద్దురాలికి బలవంతంగా తాగించారు. ఒంటిపై బంగారు నగలు ఉంటే అధికారులు పైసలు ఇవ్వరని, చెవులకు ఉన్న రెండు తులాల బంగారు గంటీలు,  పలకలు, కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీసుకొని పరారయ్యారు. మద్యం మత్తులో ఉన్న లక్ష్మమ్మ అరుపులు విని.. అటుగా వెళ్తున్న చిన్నమందడి గ్రామస్తులు వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుమారుడు మల్లేశ్​ కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

విమోచన దినంగా జరపాలి
నెట్​వర్క్​, వెలుగు:  సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని  ప్రభుత్వం అధికారికంగా  నిర్వహించాలని డిమాండ్ చేస్తూ  బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్​ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వనపర్తిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హాజరై ర్యాలీని ప్రారంభించగా, మహబూబ్​నగర్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మం, నాగర్​కర్నూల్​జిల్లాలో ఎల్నేని సుధాకర్​రావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..  తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు నాటి భారత హోంశాఖ మంత్రి సర్దార్​వల్లభాయ్​పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారా చరమగీతం పాడి దేశంలో విలీనం చేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్తూ.. ఎనిమిదేండ్లుగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో మహబూబ్​నగర్​ అసెంబ్లీ కన్వీనర్ ఎ.అంజయ్య, నాగర్​కర్నూల్​బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు,  అచ్చంపేట అసెంబ్లీ కన్వీనర్​ రేణయ్య , వనపర్తి జిల్లా నాయకులు ప్రభాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

టీఎస్ ​ఐపాస్​ పర్మిషన్లను డిలే చేయొద్దు: కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో టీఎస్​ఐపాస్​ కింద పరిశ్రమల స్థాపనకు  వచ్చిన అప్లికేషన్లను వెంటనే పరిశీలించి నిర్ధేశించిన టైమ్​లో పర్మిషన్​ ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు  అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఆఫీసులో టీఎస్​ఐపాస్​  అధికారులతో  ఆయన రివ్యూ మీటింగ్​నిర్వహించారు. జిల్లాలో  పరిశ్రమల  స్థాపన కోసం 247 అప్లికేషన్లు రాగా, 186 పర్మిషన్స్​ఇచ్చామని,  మరో 28 వివిధ కారణాల వల్ల రిజెక్ట్​చేశామని, మిగతావి  ప్రాసెస్ లో ఉన్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్లను వెంటనే క్లియర్​ చేయాలన్నారు.  టి ప్రైడ్ కింద వెహికల్స్​ కొనుగోలు కోసం  ఎస్సీలు 17,  ఎస్టీలు 66  అప్లికేషన్లు పెట్టుకున్నారని, వాటిని నిశితంగా పరిశీలించి పర్మిషన్​ఇవ్వాలని కలెక్టర్​అధికారులను ఆదేశించారు.  జిల్లా పరిశ్రమల మేనేజర్ బాబురావు, ఎల్​డీఎం భాస్కర్ , డీపీవో వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

జూరాల ప్రాజెక్టు 43 గేట్లు ఓపెన్
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. కర్ణాటక  ప్రాజెక్టులతో పాటు కృష్ణానదికి ఉపనది అయిన బీమా నుంచి కూడా వరద పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టులో  4.322 టీఎంసీల నీరు నిల్వ  కొనసాగిస్తూ  మిగతా నీటిని 43 గేట్లను తెరిచి దిగువకు వదులుతున్నారు. జూరాల డ్యాంకు 2,48,720 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తుండగా, 2,48,722 క్యూసెక్కులు  విడిచిపెడుతున్నారు. 

ఫ్రెండ్లీ పోలీసింగ్​తో ప్రజల్లో ఇమేజ్​ పెంచాలి
    ఐజీ కమల్ హాసన్ రెడ్డి  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ఫ్రెండ్లీ పోలీసింగ్​తో ప్రజల్లో పోలీసుల ఇమేజ్​పెంచాలని ఐజీ కమల్​హాసన్​రెడ్డి  చెప్పారు. బుధవారం తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ ను ఆయన విజిట్​ చేశారు. ఈ సందర్భంగా పీఎస్​లో క్రైమ్​ రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో 4 సీసీటీవీ కెమెరాలను పెట్టాలని పోలీసులను ఆదేశించారు. అన్ని మండలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ కమ్యూనిటీ పెంచుకోవాలని కోరారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకున్నారు.  ఎస్పీ కె. మనోహర్, డీఎస్పీ మోహన్ కుమార్  పాల్గొన్నారు.

జాతీయస్థాయి అవార్డులే లక్ష్యంగా పనిచేయాలి
    కలెక్టర్ ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జాతీయ స్థాయి అవార్డులే లక్ష్యంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు  చేయాలని అన్ని శాఖల అధికారులను   కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో సంబంధిత  కమిటీ సభ్యులకు నమోదు ప్రక్రియ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసి జిల్లా నుంచి ఎక్కువ అవార్డులను సాధించాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న గ్రామాలను పోటీలో నిలబెట్టాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి వివరాలను అక్టోబరు 31లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అడిషనల్​కలెక్టర్లు మనూ చౌదరి, ఎస్ మోతీలాల్, డీపీవో కృష్ణ, డీఆర్డీవో నర్సింగరావు,  జడ్పీ సీఈవో ఉష, డీఈవో గోవింద రాజులు తదితరులు పాల్గొన్నారు.  