కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నిందితుడు ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజారామ్ సింగ్ అనే వ్యక్తి.. హర్యానా నుండి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయగా నకిలీ మద్యం అని తేలిందని చెప్పారు.

గతంలో కూడా రాజారామ్ సింగ్ చాలాసార్లు విదేశీ మద్యం విక్రయించాడని.. కేసులు కూడా పెట్టినా వినకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఇతర రాష్ర్టాలతో పాటు విదేశీ మద్యాన్ని ట్రాన్స్ పోర్ట్ యజమానులు, ట్రావెల్స్ బస్సులలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యానికి హానికరమన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచి.. చెక్ పోస్ట్ లను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.