ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడితే చూస్తూ ఊరుకోం

హైదరాబాద్ : కృష్ణానీటి విషయంలో ఏపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఏపీనే నిబంధనలు అతిక్రమిస్తోందని ఆరోపించారు. ట్రైబ్యునల్, ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందన్నారు. టెలిమెట్రీలు ధ్వంసం చేసి ఏపీ అక్రమంగా నీరు తీసుకుంటోందని తెలిపారు. ఏపీ మాకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని..తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే సీఎం కేసీఆర్ కోరుకున్నారన్నారు. కానీ.. ఏపీ పాలకులు మాత్రం తమతో గొడవకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలను ఎక్కడో ఉన్న నెల్లూరు జిల్లాకు తరలించాలని చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నదీ పరివాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా.. నది పక్కనే ఉన్న పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. కృష్ణానీటిని నెల్లూరుకు తరలించడం సరైంది కాదన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడితే చూస్తూ ఊరుకోమన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ.. అక్రమంగా జల దోపిడీ చేస్తే చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.