కాకతీయ తోరణం రెండు ముక్కలు సరికాదు.. మారుస్తాం

వరంగల్‍, వెలుగు: వచ్చే నెల 7 నుంచి వారం పాటు ఓరుగల్లులో కాకతీయ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‍, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‍ గౌడ్‍ వెల్లడించారు. బుధవారం వరంగల్​కు వచ్చిన మంత్రి.. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ప్రొహిబిషన్‍ అండ్‍ ఎక్సైజ్‍, టూరిజం శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఖిలా వరంగల్‍ కోటతో పాటు అగ్గలయ్య గుట్ట, జైన్‍ పార్కులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‍విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍ యాదవ్‍తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకతీయుల చరిత్రకు 700 ఏండ్లు నిండిన సందర్భంగా ఏడో నెలలో.. ఏడో తారీఖు నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతామన్నారు. చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం బస్తర్‍లో ఉంటున్న కాకతీయుల వంశస్తులను ఆహ్వానిస్తామన్నారు. హరిత హోటళ్లను నడిపే క్రమంలో ప్రభుత్వం తరఫున సిబ్బంది, ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍ తక్కువ ఉండటం వల్లే ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 

కాకతీయ తోరణం రెండు ముక్కలు తప్పే..

కాకతీయుల గొప్పదనం తెలిపే కాకతీయు కళా తోరణాన్ని రెండు ముక్కలు చేయడం తప్పేనని మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍ చెప్పారు. ‘వెలుగు’ పేపర్‍లో వచ్చిన వార్త తన దృష్టికి వచ్చిందన్నారు. వరంగల్‍– హైదరాబాద్‍ హైవేలో రాంపూర్‍ వద్ద తోరణాన్ని రోడ్డుకు ఇరువైపులా ముక్కలు చేసి పెట్టడం సరికాదన్నారు. దానిని సవరించనున్నట్లు చెప్పారు. జిల్లా ఆఫీసర్లు భూసేకరణ చేయకపోవడం వల్లే 15 ఏళ్ల క్రితం మంజూరైన వరంగల్‍ శిల్పారామం లేటవుతోందన్నారు. ఇదిలా ఉండగా.. హరిత హోటల్​లో నిర్వహించిన రివ్యూ పావుగంటలోనే ముగిసింది. అక్రమ మద్యం, గంజాయి, గుడుంబా రవాణా,అమ్మకాలు చేసేవారిపై పీడీ యాక్టులు, భైండోవర్లు చేయాలని ఎక్సైజ్ ఆఫీసర్లకు సూచించారు. రివ్యూలో  కలెక్టర్లు గోపి, రాజీవ్‍గాంధీ హనుమంతు, ఎక్సైజ్‍ డిప్యూటీ కమిషనర్‍ జి.అంజన్‍రావు తదితరులున్నారు.

మంత్రిని నిలదీసిన బాధితులు..

రఘునాథపల్లి, వెలుగు: వరంగల్ పర్యటనకు వెళ్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలోని సర్వాయి పాపన్న కోటను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి కోట పనులను పరిశీలించారు. కాగా, కోట గోడ కూలి ఇండ్లు కోల్పోయిన బాధితులకు, తిరిగి ఇండ్లు కట్టిస్తామని గతంలో మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కేటాయించకపోవడంతో బాధిత మహిళలు మంత్రిని నిలదీశారు. డబుల్ బెడ్ రూం కాదు కదా.. కనీసం జాగైనా చూపిస్తే తాము ఇండ్లు కట్టుకుంటామని ఆగ్రహించారు. స్పందించిన మంత్రి 10రోజుల్లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్​ను ఆదేశించారు. కోట అభివృద్ధికి ఇప్పటివరకు మూడున్నర కోట్లు మంజూరు చేశామని, కోట పనులు కంప్లీట్ అయ్యాక పాపన్న జయంతిని ఇక్కడే నిర్వహిస్తామన్నారు.