- సీడీసీ చైర్మన్ పోస్టుకు పోటీపోటీ
- సిఫారసు లేఖలతో ఎవరికి వారు ప్రయత్నం
- అధికార పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు
- రెండు నెలలుగా ఆగిన నియమాకం
నామినేటేడ్ పోస్టుల కేటాయింపుల్లో గందర గోళం నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పక్రియ ఆలస్యమవుతోంది. అడ్లూరు ఎల్లారెడ్డి సుగర్ ఫ్యాక్టరీ సీడీసీ చైర్మన్ పోస్టుకు ఇద్దరు ముఖ్య నేతలు సిఫారసు లేఖలు ఇవ్వడంతో చర్చనీయాంశమైంది.
కామారెడ్డి, వెలుగు : సీడీసీ పోస్టుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుడు వేర్వేరుగా సిఫారసు చేయడంతో చైర్మన్ నియామకాన్ని మంత్రి నిలిపివేశారు. రాష్ర్టంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి లీడర్లు, కార్యకర్తలు పదవులపై ఆశ పెట్టుకున్నారు.
ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు డిమాండ్ఎక్కువగా ఉంది. జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవులు ఆశిస్తుండగా, మరి కొందరు జిల్లా స్థాయి, ఇతర పోస్టులను ఆశిస్తున్నారు. జిల్లాలో కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల పోస్టులు భర్తీ కాగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలు పూర్తిగా జిల్లా పరిధిలో ఉండగా బాన్సువాడ నియోజక వర్గం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది. బాన్సువాడ నియోజక వర్గానికి చెందిన కాసుల బాల్‌రాజుకు స్టేట్కార్పొరేషన్ పదవి దక్కింది. కామారెడ్డి నియోజక వర్గానికి చెందిన డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, అడ్వకేట్ దేవరాజ్‌గౌడ్, ఇంద్రాకరణ్‌రెడ్డి కార్పొరేషన్ చైర్మన్పదవులు ఆశిస్తున్నారు.
సీడీసీ చైర్మన్ పదవి కోసం..
జిల్లాలో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలం మాగిలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల పరిధిలో కేన్ డెవలప్మెంట్కౌన్సిల్(సీడీసీ) ఉంటుంది. ఇప్పటికే మాగి సీడీసీ చైర్మన్ పదవి భర్తీ అయ్యింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ సీడీసీ పాలక వర్గం ఇంకా నియమాకం జరగలేదు. ఈ ఫ్యాక్టరీ పరిధి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉంటుంది.
ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఉన్నందున ఎమ్మెల్యే మదన్మోహన్రావు పాలక వర్గం నియమాకం కోసం ఆగస్టు చివరి వారంలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సిఫారస్సు లేఖ ఇచ్చారు. చైర్మన్‌గా మహ్మద్ ఇర్షాద్, డైరెక్టర్లుగా మరో ఇద్దరు పేర్లు ఇచ్చి వారిని నియమించాలని కోరారు. కొద్ది రోజులకు సీడీసీ చైర్మన్‌గా కామారెడ్డి నియోజక వర్గం దోమకొండ మండలానికి చెందిన అనంతరెడ్డి ని నియమించాలని కోరుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మరో లేఖ మంత్రికి ఇచ్చారు.
ఒకే పోస్టుకు ఇద్దరు ముఖ్య నేతలు సిఫారస్సు లేఖలు ఇవ్వటంతో సీడీసీ పాలకవర్గ నియామకం నిలిచిపోయింది. షబ్బీర్‌అలీ, మదన్‌మోహన్‌రావుల మధ్య కొన్నాళ్లుగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ చర్చించుకొని ఒకరిని సూచిస్తేనే పాలక వర్గం నియామకం జరుగుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
జుక్కల్ నియోజక వర్గంలో ఎస్సీ సెల్ ఇన్చార్జీ నియామకం విషయంలోనూ విభేదాలు బయటపడ్డాయి. ఇన్చార్జిగా సౌదగర్ అరవింద్‌ను పార్టీ నియమించగా, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశామని డీసీసీ ప్రెసిడెంట్ ప్రకటించారు. జుక్కల్ ఎమ్మెల్యే సూచనతోనే డీసీసీ ప్రెసిడెంట్ ప్రకటన చేశారని అరవింద్ విమర్శించారు.
ఎమ్మెల్యేలు రాలే
జిల్లా లైబ్రరీ చైర్మన్‌గా మద్ది చంద్రకాంత్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. జిల్లాకు చెందిన ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం చర్చనీయాంశమైంది. ఇలా అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పదవులు ఆశించినవారికి నిరాశ ఎదురవుతోందని ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.