- అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఎండో మెంట్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
గతేడాది శివరాత్రి నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా క్యూ మేనేజ్ మెంట్, మంచినీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో లైట్లు, చలువ పందిళ్ల(తడకలతో) ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర అంశాలపై అధికారులకు మంత్రి సురేఖ పలు సూచనలు చేశారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.