- నాలాలకు క్యాపింగ్ లేకపోవడం తప్పే
- తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతాం: మంత్రి తలసాని
- మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదకొండేళ్ల సుమేధ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో ప్రభుత్వం స్పందించింది. ఆఫీసర్ల పొరపాటు వల్లే దుర్ఘటన జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడారు. ఓపెన్ నాలాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం తప్పేనని అంగీకరించారు. ఈ విషయంలో సుమేధ తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతామన్నారు. నాలాల్లో పడి మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జీవితకాలంలో కాంగ్రెస్‌కు అధికారం రాదు
మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని తలసాని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అతీగతీ లేదని, జీహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు ఆ పార్టీకి 150 మంది క్యాండిడేట్లు ఉన్నారా అని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ విషయంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. నాంపల్లిలో తాము కట్టింది ఒకదగ్గరైతే కాంగ్రెస్ వాళ్లు చూసింది మరో దగ్గరని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఎక్కడ ఇండ్లు కడుతున్నామో తెలుసుకుని వెళ్లాలన్నారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని అన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు ఉన్నాయని, వాటి జాబితా కూడా ఇచ్చామని గుర్తు చేశారు. గాంధీభవన్ దగ్గర భీంరావు వాడలో పేదల ఇండ్లను కూల్చిన ఘనత కాంగ్రెస్ నేతలది అని మంత్రి ధ్వజమెత్తారు. కొన్ని డబుల్ ఇండ్ల నిర్మాణానికి ఎఫ్‌టీఎల్ నిబంధనతో పర్మిషన్ రాలేదని, కొందరు కాంగ్రెస్ నేతలే కోర్టుకెళ్లి స్టే తెచ్చారని గుర్తు చేశారు.