మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం.. రోజుకో కొత్త నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకుని.. సానుభూతి కోసం చేతికి పట్టీలు వేయించుకుని ఎన్నికల ప్రచారం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. సానుభూతి పరుల డ్రామాలను నమ్మవద్దు అంటూ ప్రజలకు హితవు పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు మునుగోడులో అభివృద్ధి జరగకపోతే.. అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వీకరిస్తామని చెప్పారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగోడులో ఉన్నా.. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా చేశామన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఫ్లోరైడ్ ను పూర్తిగా తరిమికొట్టామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. చివరికి మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని తలసాని ధీమా వ్యక్తం చేశారు.