ప్రధానమంత్రి డ్రామాలు చేయడంలో ఆరి తెరిపోయారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత సమావేశాల్లో ఎప్పుడూ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనని మోడీ.. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయని పార్లమెంట్‌కి వస్తున్నాడని ఆయన విమర్శించారు.
‘ఆంధ్రప్రదేశ్ విభజన బాగా జరగలేదని మోడీ ఇప్పుడు అంటున్నారు. విభజన చట్టంలో ఆంధ్రాకు అన్యాయం జరిగితే.. నువ్వు అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాలకు నువ్వు ఏం చేశావో చెప్పు. ముందు విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చెయ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నారు. యూపీలో బీజేపీ ఓడిపోతుంది. తెలంగాణ మీద ఉన్న కక్షను మోడీ బయటపెట్టాడు. సింగరేణి అమ్మాలని చూస్తున్నారు. రైల్వేకోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ, విభజన హామీలు అమలు చేయకుండా నాటకాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ డ్రెస్ కోడ్ మారింది తప్ప మిగతా ఏం మారలేదు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.
సింగరేణి జోలికి వస్తే మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది. దేశం నుంచి ఎవరు వచ్చినా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి ఉంటే సరిపోతుంది. ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్.. మోడీని ఆహ్వానించడానికి రాలేదు అంటున్నారు. అయితే అయి ఉండొచ్చు.. తప్పు ఏముంది. మాకు న్యాయంగా చేయాల్సింది ఏదీ చేయలేదు కాబట్టి రాలేదు. మోడీ పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పు ఏముంది? అంబెడ్కర్ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. దళిత బంధును దేశ వ్యాప్తంగా అమలు చేయండి. సీఎం కేసీఆర్.. మోడీని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సందర్భాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ధార్మిక కార్యక్రమానికి వచ్చిన మోడీ.. ఇచ్చిన స్పీచ్ విన్నాం. సమత మూర్తి దగ్గరికి వచ్చే అర్హత మోడీకి లేదు. విభజించి పాలించే పార్టీ బీజేపీ, వారికి సమతా మూర్తి దగ్గరకు వచ్చే అర్హత లేదు. యూపీ ఎన్నికల కోసమే సమత మూర్తి దగ్గరకు వచ్చి మోడీ రాజకీయ స్పీచ్‌లు ఇచ్చారు. అసలు ఎవరూ అడగకుండానే.. రాష్ట్ర విభజన గురించి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. యూపీలో అఖిలేష్ యాదవ్ సీఎం అవుతాడు. దేశ రాజకీయాల్లో వచ్చే మార్పు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది’ అని తలసాని అన్నారు.