ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని

దేశ చరిత్రలో 100శాతం సబ్సిడీతో లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8 లక్షల 60 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు. బాగా ఖరీదైన ఏరియాల్లోనూ లబ్దిదారులకు ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. మొత్తం 36 వేల 884 ఇళ్లల్లో ఎస్సీలకు 8 వేల 271 ఇండ్లను కేటాయించామన్నారు. అక్టోబర్ 2, 5వ తేదీల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 

Also Read : కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగుల కోసం పోరాడారు: మంత్రి శ్రీనివాస్గౌడ్

హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆన్ లైన్ డ్రా ద్వారా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ  కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. 36 వేల 884 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించారు. లోకల్ కోటాతో కలిపి మొత్తం 39 వేల 804 ఇళ్లను కేటాయించారు. ఎంపికైన వారికి అక్టోబర్ 2వ తేదీన ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

ఇల్లు రానివాళ్లు బాధపడొద్దని, ఇంకా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. -ఇళ్ల నిర్మాణాలు ఇక్కడితో ఆగిపోదని, ఇంకా 30 వేలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల కోసం 9 వేల 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. అందరికీ పారదర్శకంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే కేసీఆర్ కల అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ తరహాలో ఇండ్లు కట్టించి ఇవ్వడం లేదని, ఒకవేళ ఎవరైనా చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మంత్రి తలసాని. లక్ష ఇండ్లు నిర్మించామంటే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు ఇండ్లు వచ్చినవాళ్లు తమను దేవుడులా చూస్తున్నారని చెప్పారు.