- 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంటొస్తది
యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్‌ను నమ్మి రిస్క్ తీసుకోవద్దని, ఆలోచన చేసి ఓటు వేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని, ఆగం కావొద్దని సూచించారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం జలాలు వచ్చాయని, మెడికల్ కాలేజీ వచ్చిందని, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అద్భుతంగా మారిందని చెప్పారు.
ఇచ్చిన హామీ ప్రకారం బొమ్మలరామారానికి గోదావరి జలాలు తెచ్చామన్నారు. ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్‌ను సాదుకుందామా..? చంపుకుందామా.? తేల్చుకోవాలని కోరారు. ఇప్పటికే 75 శాతం రుణమాఫీని అయిపోయిందని, మిగితాది పూర్తి చేయకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చామని, ఈఎన్నికల్లో 80 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్ మూడోసారి సీఎం కాగానే.. రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
తుపాకీ రాముడు లెక్క మాట్లాడుతున్న రేవంత్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తుపాకిరాముడు లెక్కన మాట్లాడతున్నారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని అంటున్నాడని మండిపడ్డారు. 24 గంటలు కావాలంటే కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. ఆ పార్టీని నమ్మి రిస్క్ తీసుకొవద్దని, పొరపాటున అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరిగా మారుతుందన్నారు. కర్నాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యిందని, హామీలు ఇచ్చిన రాహుల్, ప్రియాంకగాంధీ పత్తాకు లేరని విమర్శించారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల సంగతేమో కానీ పొరపాటున ఆ పార్టీ గెలిస్తే ఆరుగురు సీఎంలు మారుతారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ వెంటే రైతులు ఉన్నారని రైతుబంధు ఆపాలని చూసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెచ్చి ఆలేరు యువతకు ఉపాధి కల్పిస్తామని, మూడుచింతలపల్లి రోడ్డును నెలలో డబుల్ రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు.
రోడ్ షోలో ఆలేరు, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థులు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు సుదగాని హరిశంకర్ గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి, పల్లెపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.