హైదరాబాద్ : అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ నుంచి ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని అధికారులు చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మిస్సయిన ముగ్గురు లోపలే ఉన్నారా..? లేకపోతే బయట ఉన్నారా..? అన్నది తేలాల్సి ఉందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మంటలు ఆర్పడానికి సుమారు 10 గంటల సమయం పట్టిందని, ఇంత సమయం తీసుకోవడం ఇదే మొదటిసారని చెప్పారు. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల జనాలు కూడా భయభ్రాంతులకు లోనయ్యారని అన్నారు. రాంగోపాల్ పేట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఫైర్ ఆఫీసర్స్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ బిల్డింగ్ లో ఉన్న కెమికల్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా అనుమానం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని, తప్పనిసరిగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడం కోసం ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్స్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం ఇది మొదటిసారని అన్నారు.
బిల్డింగ్లో గౌడౌన్కు పర్మిషన్ లేదు : జీహెచ్ఎంసీ అధికారులు
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటనలో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సంబంధించి 4, 5 అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. శుక్రవారం (ఈనెల20న) బిల్డింగ్ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. బిల్డింగ్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. ఐదు అంతస్తుల బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. కార్ డెకర్స్, స్పోర్ట్స్ స్టోర్ లకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గోడౌన్కు ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బాధితులను ఆదుకుంటాం : హోం మంత్రి
అంతకుముందు.. అగ్ని ప్రమాద ఘటనాస్థలాన్ని హోం మంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు.. హోం మంత్రి మహమూద్ అలీకి స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.
అనుమతులు లేకుండానే గోడౌన్
కాంప్లెక్స్ లో అంటుకున్న మంటలు 6, 7 గంటలు గడిచినా అదుపులోకి రాకపోవడానికి బిల్డింగ్ ను గోడౌన్ గా వినియోగించడమే కారణమని అధికారులు చెప్పారు. 5 అంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని గోడౌన్ కోసమే వాడుతున్నట్లు గుర్తించారు. బిల్డింగ్ సెల్లార్ సహా అన్ని ఫ్లోర్లలో రెగ్జిన్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ ఉండటం మంటలు ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమయ్యాయని చెప్పారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ ను కమర్షియల్ కోసం వాడుతున్నారని, అనుమతులు లేకుండానే గోడౌన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్క భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, పోలీస్, ఫైర్ డిపార్ట్ మెంట్ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
శుక్రవారం కిషన్ రెడ్డి పరిశీలన
ప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం (ఈనెల 20న) ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన కారణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరోవైపు స్థానికులను కూడా పరామర్శించనున్నారు.