వరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ నం.1

వరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ నం.1
  •     సన్నరకాల సాగును ప్రోత్సహిస్తున్నాం
  •     బియ్యం ఎక్స్​పోర్ట్స్​లో ఇండియానే టాప్​
  •     ఎగుమతులు పెంచడానికే గ్లోబల్​ రైస్​ సమ్మిట్ 
  •     రాష్ట్రంలో రైస్ ఇండస్ట్రీనీ విస్తరిస్తాం:  మంత్రి ఉత్తమ్​
  •      హైదరాబాద్​లో ప్రపంచ వరి సదస్సు 2024 ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: వరి సాగు, ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పేర్కొన్నారు.  రాష్ట్రంలో సన్నరకాల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో 2రోజుల పాటు జరిగే గ్లోబల్​ రైస్​ సమ్మిట్​(ప్రపంచ వరి సదస్సు) 2024 శుక్రవారం ప్రారంభమైంది. చీఫ్​గెస్టులుగా తుమ్మల నాగేశ్వర్​రావుతోపాటు మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యమని, దీని కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో క్రమంగా వరి ఉత్పత్తి పెరుగుతోంది. నిరుడు వరి సాగు విస్తీర్ణం 1.20 కోట్ల ఎకరాలు ఉండగా, ఉత్పత్తి పరంగా 2.60 కోట్ల టన్నులు ఉంది. రాష్ట్రంలో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 220 వెరైటీల వరి సాగు అవుతున్నది. ఇందులో 60% దొడ్డు రకాలే. కొత్త ప్రభుత్వం మార్కెట్‌‌‌‌లో ఎక్కువ గిరాకీని కలిగి ఉన్న వరి సన్న రకాల సాగు వైపు మళ్లేలా రైతులను ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. వచ్చే సీజన్ నుంచి సన్న రకాలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌‌‌‌కు రూ.500 బోనస్‌‌‌‌గా ప్రకటించింది’ అని తుమ్మల వివరించారు.  

విదేశాలకు తెలంగాణ బియ్యం

 ప్రపంచ మార్కెట్​లో 45 శాతం వాటా కలిగిన భారత్.. బియ్యం ఎక్స్​పోర్ట్​లో టాప్​లో ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇక్కడి బియ్యం వరల్డ్​ వైడ్​గా వందకు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. తెలంగాణ బియ్యాన్ని ప్రధానంగా ఫిలిపైన్స్, అమెరికా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే వంటి దేశాలకు ఎక్స్​పోర్ట్​ చేస్తున్నట్టు తెలిపారు. సోనామసూరి, సాంబమసూరి, హెచ్ఎంటీ, ఎంటీయూ -1010 (బాయిల్డ్​ రైస్​), ఐఆర్​64 (స్టీమ్ రైస్), జేజీఎల్​వెరైటీలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నదని తెలిపారు. దేశంలో బియ్యం ఉత్పత్తి 14 కోట్ల టన్నులకు చేరిందని, అయినప్పటికీ వ్యవసాయ సంక్షోభం నేటికీ ఒక సవాలుగా ఉన్నదని అన్నారు. 

ఎక్స్​పోర్ట్స్​ పెంచడానికే గ్లోబల్​ రైస్​ సమ్మిట్ 

ఎక్స్​పోర్ట్స్​ మార్కెట్‌‌‌‌ను మరింత విస్తరించడానికి ఇండియన్​, వరల్డ్​ బిజినెస్ మన్లను ఒక గొడుకుకిందకు తీసుకురావడానికి సమ్మిట్​ఒక వేదిక అవుతుందని మంత్రి తుమ్మల అన్నారు. ఈ సమ్మిట్‌‌‌‌లో పాల్గొంటున్న సైంటిస్టులు, మిల్లర్లు, ప్రోగ్రెసివ్​ ఫార్మర్స్​కు ​ విదేశాల్లో అనుసరిస్తున్న లేటెస్ట్​ మిల్లింగ్​ టెక్నాలజీ, అత్యాధునిక స్టోరేజ్​ తదితర అంశాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, సూపర్ ఫైన్ రకం తెలంగాణ సోనా ఎక్స్​పోర్ట్​కు అనువైందని తెలిపారు. అధిక దిగుబడిని ఇస్తూ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు, ఎక్స్​పోర్ట్​కు అనువైన సన్న ఫైన్​ వరి రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మార్కెట్​లో 6 మి.మీ. కంటే ఎక్కువ పొడవు ఉన్న విత్తనాలకు డిమాండ్‌‌‌‌ ఉందని చెప్పారు. 

కమోడిటీస్​ కౌన్సిల్​ను ఏర్పాటు చేయాలి: చిన్నారెడ్డి

ఇజ్రాయెల్ తరహాలో మన దేశంలోనూ కమోడిటీస్​ కౌన్సిల్​ను ఏర్పాటు చేయాలని ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్రంలోనూ వరి, పత్తి పంటలకు  కమోడిటీ బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సాగు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రపంచానికి అనువైన రకాలు పండిస్తున్నామని అగ్రికల్చర్​సెక్రటరీ రఘునందన్ రావు  పేర్కొన్నారు. దేశంలోనే ఇలాంటి శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం మొదటిసారి అని, అది హైదరాబాద్​ వేదికగా నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం అని తెలిపారు. కాగా, ‘అధిక దిగుబడులు ఇచ్చే వరి వంగడాలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, సాగులో సవాళ్లు లాంటి అంశాలపై సమ్మిట్​లో చర్చించారు. కార్యక్రమంలో ఐసీఐ ప్రెసిడెంట్ జెరెమీ జ్వింగర్, ప్రొఫెసర్​ అల్దాస్​ జానయ్య, సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ డీఎస్​ చౌహన్, అగ్రికల్చర్​ డైరెక్టర్​ బీ గోపి, హార్టికల్చర్​​ డైరెక్టర్​అశోక్ రెడ్డి, 25 దేశాల ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి అన్ని రకాల మద్దతు: మంత్రి ఉత్తమ్​

రాష్ట్రంలో రైస్ ఇండస్ట్రీనీ విస్తరిస్తామని సివిల్ ​సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 3 వేల అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయానికి అన్ని రకాలుగా - ప్రభుత్వం మద్దతు ఇస్తోందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సే-కరిస్తోందని అన్నారు. - రాష్ట్రంలో రైతు అనుకూల ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సాగునీటి వనరులు పెరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న వరి ఉత్పత్తి థాయ్ లాండ్ తో సమానమని వివరించారు.