- ఆధార్లో తప్పుల కారణంగానే రుణమాఫీ జరగలే
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల్లో తప్పుల సవరణ స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. 1,24,604 మంది రైతుల ఆధార్ వివరాలు తప్పుగా నమోదయ్యాయన్నారు. వాటిని సరి చేయాలని సంబంధిత బ్యాంకులకు ఆదేశించామని తెలిపారు. ఇప్పటి దాకా 41,339 మంది రైతుల ఆధార్ వివరాలను సరి చేశామన్నారు.
ఆగస్టు 15 నాటికే 22.37 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. మంగళవారం వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రఘునందన్ రావు క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని రైతుల కోసం స్పెషల్ యాప్ తీసుకొచ్చాం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రయల్ టెస్ట్ పూర్తయింది.
బుధవారం నుంచి గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారి సర్వే చేస్తారు. రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ చేసి అప్లోడ్ చేస్తారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి గ్రామాల వారీగా ప్రణాళికలను తయారు చేసి, దాని ప్రకారంగా కుంటుంబ సభ్యుల వివరాలను యాప్ లో నమోదు చేయాలి’’అని రఘునందన్ రావు అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, అధికారులు పాల్గొన్నారు.