ఆయిల్ పామ్​ఫ్యాక్టరీల పనులను వేగవంతం చేయండి: మంత్రి తుమ్మల

ఆయిల్ పామ్​ఫ్యాక్టరీల పనులను వేగవంతం చేయండి: మంత్రి తుమ్మల
  • ఆయిల్ ఫెడ్ ను కార్పొరేట్​సంస్థగా తీర్చిదిద్దాలి
  • నర్మెట్టలో మే నెలాఖరుకు గెలల ప్రాసెసింగ్ ప్రారంభించాలి
  • ప్లాంటేషన్ టార్గెట్​నూ పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపడుతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో చేపడుతున్న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి.. మే నెలాఖరు నాటికి ఆయిల్ పామ్​గెలల ప్రాసెసింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సెక్రటేరియెట్​లో ఆయిల్​ ఫెడ్​ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

తెలంగాణ ఆయిల్ ఫెడ్‌‌ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కార్పొరేట్​ సంస్థల తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆయిల్ ఫెడ్‌‌ సంస్థలోని ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి.. సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. 

మార్చి నాటికి ఆయిల్ పామ్​ కంపెనీలు.. నిర్దేశించిన ప్లాంటేషన్ టార్గెట్​ను పూర్తి చేయించాలని ఆయిల్ ఫెడ్​ డైరెక్టర్​కు సూచించారు. ప్లాంటేషన్​ టార్గెట్​పూర్తి చేయని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హెచ్చరించారు.

ప్రాథమిక సహకార సంఘాల ఓటరు జాబితా రెడీ చేయండి..

గడువు ముగిసిన అన్ని ప్రాథమిక సహకార సంఘాల ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు సరిచేసి సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్యాక్స్​ సంఘాలకు సంబంధించి పెండింగ్‌‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి.. తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలోఅగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సహకార శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.