గోళ్లపాడు చానెల్​ పనులు త్వరగా పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వర రావు

గోళ్లపాడు చానెల్​ పనులు త్వరగా పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం టౌన్,వెలుగు : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి, వెంటనే పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ముజామ్మీల్​ ఖాన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. నియోజకవర్గంలో పనులపై కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్​తో ఆదివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో చర్చించి ఖమ్మం లో అవసరమున్న చోట ఖబరస్థాన్, షాదీ ఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం ఉండేలా చూడాలన్నారు. 

సారథి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సత్వరమే ప్రజలకు అందుబాటులోకి తేవాలని, గోళ్ళ పాడు ఛానల్ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్బన్ పార్క్ లో ఆహ్లాదం ఏ పనులు చేయాలో..  శాఖల వారీగా నివేదిక తయారు చేయాలని,  వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను మణి హారంలా తీర్చిదిద్దాల ని   అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

హాస్పిటల్ ను తనిఖీ చేసిన మంత్రి 

జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాఫ్ అటెండన్స్ వివరాల రికార్డ్ లను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని మంత్రి సూచించారు. తనిఖీ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్​ లేకపోవడం తో మంత్రి ఆరా తీసి అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి  బెడ్స్​ పెంచే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. ఎంసీహెచ్​ ఎదురుగా ఉన్న మురికి కూపాన్ని   వెంటనే తొలగించాలని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి హాస్పిటల్ తనిఖీ చేసిన వెళ్లిన తర్వాత ఉన్నతాధికారులు హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. ఆదివారం, పండుగ పేరుతో జనరల్, ఎంసీహెచ్ లలో అల్ట్రా సౌండ్, టెఫ్ఫా స్కానింగ్ గదులు మూసివేయడంతో అత్యవర వైద్యం కోసం వచ్చిన రోగులు అవస్థలు పడ్డారు.