- రూ.155 కోట్లతో ఆధునికీకరణ పనులు
- నిధులు మంజూరు, త్వరలోనే శంకుస్థాపన
- కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం కూడా అప్పుడే..
ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ త్వరలోనే కొత్త రూపు సంతరించుకోబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.155.45 కోట్లు మంజూరు చేయగా, రెండు వారాల్లోనే పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ కావడం, తన సొంత నియోజకవర్గంలో ఉన్న పెద్ద మార్కెట్ కావడంతో దీన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావిస్తున్నారు.
మూడ్రోజులకు ముందే ఖమ్మం మార్కెట్ కు కొత్త పాలకవర్గాన్ని ప్రకటించారు. ఆ కమిటీ ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ నెల మొదటివారంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు సందర్శించి మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా పాత నిర్మాణాలను తొలగించడంపై సమీక్షించారు.
రూ.155.45 కోట్లతో...
ఖమ్మంలో 1954లో 15.39 ఎకరాల్లో వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని ఆనుకొని 7.20 ఎకరాల్లో మార్కెట్ ను విస్తరించారు. మిర్చి అమ్మకాలకు ఖమ్మం ఫేమస్. ప్రతిఏటా సీజన్ లో మిర్చి, పత్తి బస్తాలతో మార్కెట్ యార్డులన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రతి ఏటా మార్కెట్ కు వచ్చే బస్తాల సంఖ్య పెరుగుతున్నా, లావాదేవీల ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతున్నా మార్కెట్లో సౌకర్యాలు మాత్రం పెరగలేదు. గతంలో నిర్మించిన భవనాలు, షెడ్లు కూడా పాతబడ్డాయి. సరైన స్టోరేజీ సౌకర్యాలు లేవు.
ALSO READ | బోధన్ షుగర్ ఫ్యాక్టరీ షిఫ్ట్ ! ..రెంజల్‌లోగానీ, ఎడపల్లిలో గానీ ఏర్పాటుకు ప్రయత్నాలు
పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మార్కెట్ ను ఆధునీకరించడంతో పాటు, పంట అమ్ముకునేందుకు వచ్చే రైతులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం, వ్యాపారులు, ఉద్యోగులకు వసతుల కోసం ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. రూ.155.45 కోట్లతో రెండు దశల్లో నిర్మాణాలు చేయనున్నారు. తొలిదశలో పాత నిర్మాణాలను తొలగించి, కొత్త షెడ్లను, కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తారు. రెండో దశలో మార్కెట్ ఆఫీస్ తో పాటు కమిషన్ ఏజెంట్ల కోసం ఐదు అంతస్తుల చొప్పున రెండు భవనాలను 1.60 లక్షల స్క్వేర్ ఫీట్లలో నిర్మిస్తారు.
కొత్తగా వచ్చే సౌకర్యాలు ఇవే..!
ప్రస్తుతం ఉన్న మార్కెట్లో షెడ్ ఏరియా 1.20 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉండగా, దాన్ని 3.50 లక్షల స్క్వేర్ ఫీట్లకు పెంచనున్నారు. 72 వేల బస్తాల స్టోరేజీ కెపాసిటీని 2.50 లక్షల బస్తాలు పట్టేలాగా విస్తరించనున్నారు. మొత్తం ఏడు షెడ్లు నిర్మించనున్నారు. మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోళ్లతో పాటు అవసరమైతే అక్కడే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ మేనేజ్ మెంట్ సిస్టమ్‌ను, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వేర్ హౌజ్ షెడ్లతో పాటు, కోల్డ్ స్టోరేజీలకు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తారు.
మరో ఆర్సీసీ బిల్డింగ్ లో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో అమ్మకాల కోసం, రెండో అంతస్తులో ట్రేడర్లు, ఆఫీస్ అవసరాల కోసం గదులు నిర్మిస్తారు. రైతులకు విశ్రాంతి గదులు, టాయిలెట్స్, క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్కెట్ కు వచ్చే రహదారులను కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా విస్తరిస్తారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయనున్నారు.
త్వరలోనే శంకుస్థాపన చేస్తాం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను దేశానికే మోడల్ మార్కెట్ చేస్తాం. భవిష్యత్ లో వచ్చే సవాళ్లకు అనుగుణంగా పనులను చేపడుతున్నాం. మార్కెట్ కు వాహనాలు రావాలండే చుట్టూ ఉన్న రహదారులు వెడల్పుగా ఉండాలి. అందుకే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు, రైతులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా కొత్త నిర్మాణాలుంటాయి. త్వరలోనే శంకుస్థాపన చేసి, అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఈ సీజన్ లోనే పనులు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. 15 రోజుల్లో మద్దులపల్లి మార్కెట్ అందుబాటులోకి వస్తే ఖమ్మం మిర్చి మార్కెట్ పై కొంత ఒత్తిడి కూడా తగ్గుతుంది. – తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి