- అధికారులు రైతుకు అండగా నిలవాలి: తుమ్మల
- మార్క్ఫెడ్, మార్కెటింగ్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ
మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. శనివారం ఆయన మార్క్ ఫెడ్, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి, పెసర, సోయ తదితర వానాకాలం పంటల కొనుగోళ్లలో ఎదరువుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూపెసర పంట కొనుగోళ్లు పూర్తి కావచ్చాయని తెలిపారు. ఇప్పటికే రూ.8.03 కోట్ల విలువైన 924.85 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇంకా ఒకట్రెండు మార్కెట్లకు మాత్రమే పెసర్లు వస్తున్నాయని చెప్పారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో రూ.35.86 కోట్లు వెచ్చించి 4,793 రైతుల నుంచి 7330.50 టన్నలు సోయా పంట కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకా 50 వేల టన్నులు మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని ఎండీ మంత్రి తుమ్మలకు వివరించారు.
పత్తి రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించండి
పత్తి పంటకు మద్దతు ధర అందించి, రైతులకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పత్తి మద్దతు ధరతో కొనుగోలుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పత్తి రైతులు తేమ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీసీఐ సీఎండీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పత్తిలో తేమ శాతం కొంత ఎక్కువ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసేలా చూడాలన్నారు. కొనుగోళ్లకు అవసరమైన ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.