-
ఈ నెలాఖరులోపు మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు
-
బీఆర్ఎస్ హయాంలో చేసినది మిత్తిలకు కూడా సరిపోలే
-
రాష్ట్ర వ్యాప్తంగా 7, 250 వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-
రైతు భరోసా కింద రైతులకు రూ. 7,600 కోట్లు అందిస్తాం
-
కామారెడ్డిలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
భిక్కనూరు, వెలుగు : రుణమాఫీకాని రైతులు అధైర్య పడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. ఈనెలాఖరులోపు అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారన్నారు. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో కేవలం రూ. లక్ష రుణమాఫీని నాలుగుసార్లు చేస్తే.. అవి రైతుల మిత్తిలకు కూడా సరిపోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చూపారని తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్గేట్వద్ద కొత్త ఎన్నికైన టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు స్వాగతం పలికేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసి చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. వానాకాలంలో దాదాపు కోటి 45లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే చాన్స్ ఉందని వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు రాష్ర్టవ్యాప్తంగా 7,250 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిపారు.
సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను కూడా రైతులకు అందించనున్నట్లు చెప్పారు. రూ. 2 లక్షలకుపైన ఉన్న రుణం రైతులు డబ్బులు కట్టుకుంటే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో పాటు మళ్లీ రుణాలు అందజేస్తామన్నారు. రైతు భరోసా కింద రైతులకు రూ. 7,600 కోట్లు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ, టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి,పార్టీ మండలాధ్యక్షుడు భీమ్‌రెడ్డి ఉన్నారు.