తీన్మార్​ మల్లన్నను గెలిపించాలి  : తుమ్మల

తీన్మార్​ మల్లన్నను గెలిపించాలి  : తుమ్మల
  •     మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు, నాయకులు 

ఖమ్మం టౌన్, మధిర/అశ్వాపురం/కామేపల్లి/కారేపల్లి, వెలుగు : ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో గురువారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.

మల్లన్న గెలుపు ఖాయమే అయినప్పటికీ భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత దిశగా కృషి చేయాలని కోరారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్​కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాంరెడ్డి  మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని పిలుపునిచ్చారు. మధిర మండల, పట్టణ స్థాయి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్ అధ్యక్షతన పట్టణంలోని కేశవ్​భవన్​లో నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  పువ్వాళ్ల దుర్గాప్రసాద్,  ఎమ్మెల్సీ ఎన్నికల మధిర ఇన్​చార్జి, ఖమ్మం పట్టణ  అధ్యక్షుడు ఎస్ కే జావిద్,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను చట్టసభలలోకి పంపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

మల్లన్నను చట్టసభకు పంపిస్తే నిరుద్యోగ యువతకు అండగా నిలబడతారని తెలిపారు. కామేపల్లి మండలం ముచ్చర్లలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టభద్రులను కలిసి కలిసి  మల్లన్న గెలిపించాలని ప్రచారం చేశారు. కారేపల్లి లోని వైయస్ఎన్ గార్డెన్​లో  నిర్వహించిన సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారని చెప్పారు. గ్రాడ్యుయేట్లకు అండగా నిలిచిన మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కాగా ఇక్కడ పాత, కొత్త నాయకులను వేదిక పైకి పిలవడంలో వచ్చిన తేడాతో సమావేశం కొంత రసాభాసగా మారింది. వెంటనే ఎమ్మెల్యే రాందాస్ కలుగజేసుకుని కార్యకర్తలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అశ్వాపురంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరావు మాట్లాడుతూ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.