
- జార్ఖండ్ వ్యవసాయ మంత్రి శిల్పి నేహా తెర్కేతో మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్, వెలుగు: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్అని జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే అన్నారు. ఆదివారం మంత్రి శిల్పి నేహా తెర్కే రాష్ట్రంలో ఐదు రోజుల పర్యటన కోసం హైదరాబాద్కి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెర్కే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల్లో రైతు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ పర్యటన ఇరు రాష్ట్రాల మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ఒక ముందడుగుగా భావిస్తున్నామని తేర్కే అన్నారు. అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను మంత్రి తుమ్మల వివరించారు. రూ.20,616 కోట్లతో 25,35,964 మంది రైతులకు 2 లక్షల లోపు పంట రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేసినట్టు తెలిపారు. రైతుభరోసా పథకంతో పంట పెట్టుబడి సహాయం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, మైక్రో ఇరిగేషన్ పథకానికి సబ్సిడీలు అందిస్తున్నట్టు చెప్పారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, గత మూడు నాలుగేండ్లలో 2 లక్షల ఎకరాలకు సాగును విస్తరించినట్టు పేర్కొన్నారు. పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. సన్నరకం వరి సాగుకు రూ.500 బోనస్, సివిల్ సప్లై శాఖ ద్వారా మద్దతు ధరలతో వరి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అగ్రికల్చర్లో ఏఐ వినియోగం, కొత్త పథకాలు, మార్కెటింగ్ సౌకర్యాలతో రైతులకు లాభదాయక విధానాలను అమలు చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు. మంత్రి తెర్కే తెలంగాణలోని ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించాలని ఆహ్వానించారు.