కళాకారుల కోసమే హస్తకళల అభివృద్ధి సంస్థ : మంత్రి తుమ్మల

 కళాకారుల కోసమే హస్తకళల అభివృద్ధి సంస్థ : మంత్రి తుమ్మల
  • స్కిల్ యూనివర్సిటీలో సెగ్మెంట్ ఏర్పాటు చేస్తం: మంత్రి తుమ్మల
  • ఎన్టీఆర్​ స్టేడియంలో క్రాఫ్ట్స్ టెక్స్ టైల్స్ మేళా ప్రారంభం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లక్ష మంది కళాకారుల కోసం తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ పనిచేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ, నాబార్డ్  సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్  టెక్స్ టైల్స్ మేళాను మంత్రి తుమ్మల.. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ శైలజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీలో చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఒక సెగ్మెంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. 

కళాకారుల కళారూపాలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబజేస్తున్నాయన్నారు. కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సదాశయంతో గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్  హస్తకళల అభివృద్ధి సంస్థ ముందుకు సాగుతున్నదన్నారు. ఎక్కడ ఏ అధికారిక కార్యక్రమం జరిగినా హస్త కళాకారులు చేసిన కళాకృతులనే బహుమతిగా ఇచ్చేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. శైలజ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం పది మంది కళాకారులకు రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్  జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.